పొలిటికల్‌ హీట్‌.. రేవంత్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ | Minister Bandi Sanjay Letter To CM Revanth Reddy Over Modi Name | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ హీట్‌.. రేవంత్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

Jan 29 2025 3:11 PM | Updated on Jan 29 2025 4:15 PM

Minister Bandi Sanjay Letter To CM Revanth Reddy Over Modi Name

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో విషయమై కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యద్ధం నడుస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)కి కేంద్రమంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay) లేఖ రాశారు. దీంతో, మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది.

కేంద్రమంత్రి బండి సంజయ్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్బంగా లేఖలో​..‘తెలంగాణలో రేషన్‌కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం పేరును కొనసాగించాలని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో అర్హులకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు.

జనవరి 26 నుంచి అమలు చేసిన నాలుగు పథకాలు.. రాష్ట్రంలో మూడు శాతం మందికి కూడా చేరలేదని తెలిపారు. అలాగే, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పిన రైతు భరోసా ఎక్కడ? అని ప్రశ్నించారు. 10లక్షల మంది రైతు కూలీల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు?. కొత్తగా ఇస్తామని చెప్పిన 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారని లేఖలో పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్లపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడతామంటే ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. మోదీ సర్కారు మంజూరు చేసే ఇళ్లకు ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రేషన్‌ కార్డులపై ప్రధాని ఫోటో కచ్చితంగా పెట్టాలని, లేదంటే రాష్ట్రానికి ఉచిత బియ్యం సరఫరా నిలిపివేస్తామని చెప్పారు. అవసరమైతే కేంద్రమే పేదలకు ఉచిత బియ్యం పంపిణీపై ఆలోచిస్తుందన్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాల బాటలో నడుస్తోందని ఆరోపించారు. ఫాంహౌస్, ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్‌ కేసులన్నీ మరుగునపడ్డాయని విమర్శించారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌ అరెస్టుకు అన్ని ఆధారాలున్నాయని సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement