Telangana: వంద సీట్లతో హ్యాట్రిక్‌ సాధిద్దాం 

Ktr Speech at Rajanna Sirisilla District BRS Atmiya Sammelanam - Sakshi

ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: మంత్రి కేటీఆర్‌ 

ప్రధాని మోదీ తెలంగాణ పుట్టుకనే అవమానించారు 

గ్రూప్‌–1 లీకేజీలో నాపై, నా పీఏపై చేసిన ఆరోపణలు నిరూపించాలి 

రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగం 

సిరిసిల్ల: రాష్ట్రంలో అక్టోబర్, నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందసీట్లు సాధించి హ్యాట్రిక్‌ సాధిద్దామని కార్యకర్తలకు ఉద్బోధించారు. ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్‌ సాధించిన సీఎంలేరని, ఆ ఘనత కేసీఆర్‌కు దక్కేలా ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

సోమవారం రాజన్న సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ ప్రసంగించారు.  తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని శత్రుదేశాన్ని చూసినట్లుగా కేంద్రం చూస్తున్నారన్నారు. గుజరాతోళ్ల చెప్పులు మోసే సన్నాసులు తెలంగాణలో పుట్టడం దౌర్భా గ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. 

గుజరాత్‌లో 13సార్లు పేపర్లు లీకయ్యాయి 
గ్రూప్‌–1 పేపర్‌ లీక్‌ విషయంలో తనపై, తన పీఏపై ఆరోపణలు చేస్తున్నారని, గుజరాత్‌లో 13సార్లు పేపర్లు లీకైతే.. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని కేటీఆర్‌ మండిపడ్డారు.

తన పీఏ తిరుపతి సొంతూరు జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతారంలో ముగ్గురు పరీక్ష రాస్తే ఒక్కరు కూడా క్వాలిఫై కాలేదని, మల్యాల మండలంలో 477 మంది పరీక్షలు రాస్తే 35 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, జగిత్యాల జిల్లాలో ఒక్కరికి మాత్రమే గ్రూప్‌–1లో వందకు పైగా మార్కులు వచ్చాయని కేటీఆర్‌ స్పష్టంచేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,205 మంది రాస్తే.. 255 మంది మాత్ర మే క్వాలిఫై అయ్యారన్నారు. మరి తనపై ఆరోప ణ లు చేస్తున్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని దుయ్యబట్టారు. వారిద్దరు ఏం చదువుకున్నారన్నారు. 

నియత్‌ ఉంటే మనకే ఓటు వేయాలి 
మన సంక్షేమ పథకాలను పొందుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా నియత్‌ ఉంటే మనకే ఓటేయాలని కేటీఆర్‌ చెప్పారు. ఉపాధి పథకం పనులకు సంబంధించి రూ.1,200 కోట్ల నిధులను కేంద్రం పెండింగ్‌లో పెట్టిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు గత డిసెంబర్‌ వరకు పెండింగ్‌లో ఉన్న రూ.1,300 కోట్ల నిధులను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.  

60 లక్షల గులాబీ దండుంది 
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారని, వారితో క్షేత్రస్థాయిలో ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహించాలని కేటీఆర్‌ చెప్పారు. ఏప్రిల్‌ 20లోగా మున్సిపాలిటీలు, గ్రామాల్లో నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సంసిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. గృహలక్ష్మి పథకాన్ని అమలు చేసి, నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

అర్హతలున్న పార్టీ కార్యకర్తలకూ ఇల్లు మంజూరు చేయాలని, పెన్షన్లు ఇప్పించాలన్నారు. సమావేశంలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు ఎల్‌.రమణ, బస్వరాజు సారయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ, దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగినుల పిల్లల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన క్రెచ్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడున్న చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. పిల్లల్ని ఎత్తుకుని ముద్దుచేశారు. తనూ ఓ పిల్లాడిలా మారిపోయారు.       – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top