మాటల్లో కాదు.. చేతల్లో పోటీ పడదాం

Ktr Dares Bandi to Bring 1000 CR Special Package From Centre - Sakshi

బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్‌

కేంద్రం నుంచి రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీ తేవాలె.. 

అన్ని పాఠశాలల్లో వసతులు కల్పిస్తామని వెల్లడి

దళితబంధు కింద ఏర్పాటవుతున్న రైస్‌మిల్లుకు మంత్రి భూమిపూజ

సిరిసిల్ల: రాష్ట్రంలో అభివృద్ధి కరెంట్‌లా వెలుగుతోం దని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మాటలు మస్తుగా మాట్లాడొచ్చని, అడ్డమైన మాటల్లో కాదు.. అభివృద్ధిలో పోటీ పడదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి సంజయ్‌ రూ. వెయ్యి కోట్ల ప్యాకేజీ తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనుల్లో చారానా మాదే.. బారాణా మాదే అనడం అలవాటైందని.. తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధి దేశంలోని 6 లక్షల పల్లెల్లో ఎక్కడా లేదెందుకని ప్రశ్నించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో ‘మన ఊరు.. మన బడి’లో భాగంగా అభివృద్ధి పనులకు కేటీఆర్‌ బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఏది చెప్పినా సినిమా చూపించినట్లే ఉంటుందని, గొట్టు పనులు మొదలుపెడతారని అన్నారు. ‘కేసీఆర్‌కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రం వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అయినా సాధించాం’అని చెప్పారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, ఇంటింటికీ నీళ్లు వంటి పథకాలన్నింటిపైనా తొలుత అనుమానమే వ్యక్తం చేశారని.. అయినా సీఎం చేసి చూపించారని గుర్తు చేశారు. 

మూడేళ్లలో 26 వేల పాఠశాలల్లో వసతులు
‘మన ఊరు–మన బడి’పథకం భాగంగా రూ.7,300 కోట్లతో 26 వేల స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని కేటీఆర్‌ చెప్పారు. డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేస్తామని, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కేసీఆర్‌ మనవడు, మనవరాలు ఏ బియ్యం తింటున్నారో అదే సన్నబియ్యంతో రాష్ట్రంలో 973 గురుకులాలలో భోజనం పెడుతున్నామని చెప్పారు. రూ.16 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించామన్నారు. 

దళితుల సాధికారతే దళితబంధు లక్ష్యం
సామాజిక వివక్షకు, అణచివేతకు గురైన దళితుల సాధికారత, స్వావలంబన లక్ష్యంగా దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిరకు చెందిన దళితులు సామూహికంగా రైస్‌మిల్లు, పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేసుకుంటుండగా వీటికి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూలీల నుంచి ఓనర్లుగా, సక్సెస్‌ఫుల్‌ వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top