ఆ సాహసం చేయగల దమ్ము రామోజీకి ఉందా?

Kommineni Srinivasa Rao Comments On Eenadu Article - Sakshi

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా గురించి ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు చాలా ఆందోళన పడుతోంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.  నాటి గర్జనలు ఏవీ అంటూ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పత్రిక ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఈ అంశంపై చేసిన ప్రసంగాలను, యువభేరీలను ప్రస్తావించి రాసింది. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లో మార్పు వచ్చిందని, కాడి పారేశారని ఈ పత్రిక వ్యాఖ్యానించింది.

చిత్తశుద్దితో ఈ వార్త రాసి ఉంటే హర్షించవచ్చు. అలాగే ఇకపై ప్రత్యేక హోదాపై తాము గర్జిస్తామని ఈనాడు పత్రిక ప్రకటించి ఉంటే ఓహో మరో మధ్య నిషేద ఉద్యమం మాదిరి నడుపుతుందేమోలే అని జనం అనుకునేవారు. ఈ విషయమై బిజెపిని ,ప్రధాని మోడీని తీవ్రంగా దుయ్యబడుతూ ఈనాడు సంపాదకీయం, వార్తా ప్రసారాలు చేస్తే వారికి దీనిపై విశ్వాసం ఉందేమోలే అని  భావించవచ్చు. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనలు, ఆ తర్వాత హోదానే వద్దు, ప్యాకేజీనే ముద్దు అని చెప్పిన విషయాలు, తదుపరి మళ్లీ వైఖరి మార్చుకుని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం , ఆ క్రమంలో ప్రధాని మోడీని తీవ్రంగా దూషించడం, నల్లబెలూన్లు ఎగరవేసిన సంగతులు కూడా రాసి ఉంటే రెండువైపులా ఈ అంశాన్ని కవర్ చేసిందిలే అనుకోవచ్చు.

కానీ కేవలం జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలను మాత్రం ఇస్తూ ఏవీ గర్జనలు అంటూ కధనాన్ని ఇవ్వడం ద్వారా ఎలాగొలా టిడిపికి మేలు చేయాలన్న లక్ష్యం, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టాలన్న దురుద్దేశమే కనిపిస్తాయి.అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి మద్య తీవ్రమైన విభేదాలు ఏర్పడాలని, తిరిగి బిజేపీ, టీడీపీని మనసులో  పెట్టుకుని రాసినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది.  ఈ కథనంలో  ఎక్కడైనా జగన్  ప్రత్యేక హోదా డిమాండ్ ను వదలుకోలేదని ఒక్క ముక్క రాసినా సంతోషించవచ్చు. కాని జగన్ గర్జించడం లేదని, రాష్ట్రపతి ఎన్నికను అవకాశంగా తీసుకోవాలని వివిధ వర్గాలు కోరుతున్నాయని రాశారు. మరి అదే రాష్ట్రపతి ఎన్నిక టిడిపికి కూడా అవకాశమే కదా?మరి వారు బిజేపీ నిలబెట్టిన అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు వేస్తారా? అన్న అంశాన్ని ప్రస్తావించలేదు.నిజానికి రాష్ట్రపతి ఎన్నికలో వైసిపి ఏమీ కీలకం కాబోవడం లేదు. ఒడిషాలోని బీజేడీ మద్దతు ఇచ్చినా, టీఆర్‌ఎస్‌ వంటి ఒకటి,రెండు పార్టీలు రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉన్నా, బీజేపీకి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాదు. 

వైసీపీతో అవసరమే ఉండదు. ఉన్నంతలో కేంద్రంతో ఎంతో కొంత సఖ్యత కొనసాగిస్తూ రాష్ట్రానికి అవసరమైన నిధులు
 పొందడానికి యత్నిస్తున్న జగన్ ప్రభుత్వానికి ఆ రకమైన సాయం కేంద్రం నుంచి అందకూడదన్న తాపత్రయమే తప్ప లక్ష్య శుద్ది లేదు.  ప్రత్యేక హోదా ద్వారా ఏపీకి మేలు జరుగుతుందని జగన్ ప్రచారం చేసిన మాట నిజం. ఆయన ఇప్పటికీ వెనక్కి తగ్గలేదు కదా?రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత కలిసిన జగన్ ఏమన్నారు. బీజేపీ రెండోసారి పూర్తి మెజార్టీతో గెలవడం మన ఖర్మ అని, వారికి మెజార్టీ తగ్గి ఉంటే మన అవసరం పడి ,ప్రత్యేక హోదా  డిమాండ్ సాధించేవారమని ఆయన అన్నారు. ప్రధానిని కలిసి వచ్చిన వెంటనే ఈ మాటలు అనడానికి ఎంత గట్స్ ఉండాలి. మరి ఆ విషయాన్ని ఈనాడుమీడియా గుర్తించదా? వైసీపీకి 25 మంది ఎంపీలు ఇవ్వండి.. కేంద్రంలో ఏ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుందో వారికే మద్దతు ఇస్తామని ఆయన అన్నారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేదుకదా?బీజేపీకి సొంతంగా మెజార్టీ వచ్చేసింది కదా. ఆ పార్టీ ప్రత్యేక హోదాపై తన వైఖరిని మార్చుకుంది కదా..అందుకు ఆ పార్టీని కూడా గట్టిగా తప్పుపట్టాలికదా..ఆ దిశలో ఒక్క మాట అయినా రాసే ధైర్యం ఈనాడుకు లేదా? జగన్ కేంద్రంలో జరిగిన ప్రతి సమావేశంలోను, ప్రధాని మోదీ,హోం మంత్రి అమిత్ షా లను కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నారు. అది చాలదు.. ఇంకా పోరాడాలని అని ఈనాడు రాయవచ్చు. 

ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే అధికారంలోకి వచ్చాక కొంత బాధ్యత పెరుగుతుంది. ఈ విషయంలో ఆయన కొంత సౌమ్యంగా ఉండవచ్చు.దానిని తప్పుపట్టదలిస్తే తప్పుపట్టవచ్చు. ప్రతిపక్షనేతగా జగన్ చేసిన పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్రంగా దుర్భాషలాడారే. 

తన మాదిరి మోదీకి అసలు కుటుంబం ఎక్కడ ఉందని నిలదీశారే. మోదీ ఏపీకి వస్తే స్వాగతం కూడా చెప్పకుండా నల్ల బెలూన్లు ఎగురవేశారే. అంత ధైర్యశాలి, 2019లో ఓటమి తర్వాత ఎందుకు పిల్లి మాదిరి మారిపోయారు. జగన్ కేసులనో, ఇంకొటనో వ్యాఖ్యానిస్తున్నారే తప్ప మోదీని ఒక్క మాట అనడం లేదే? అప్పట్లోనే జగన్ ను మోదీ దత్తపుత్రుడు అని, తానే పోరాట వీరుడనని చంద్రబాబు చెప్పుకునేవారు కదా.మరి ఇప్పుడు ఏమైంది ఆ పోరాటం. జగన్ అప్పట్లో ఎపి ఎమ్.పిలంతా రాజీనామా చేసి పోరాడుదాం అని చెప్పిన మాట వాస్తవమే. దానికి అనుగుణంగా తన పార్టీ ఎమ్.పిలు వారితో  రాజీనామా చేయించలేదా? మరి అప్పుడు టిడిపి తన ఎమ్.పిలతో ఎందుకు రాజీనామా చేయించలేదు.అయితే కేంద్రంలోని ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించింది. అంతవరకు ఓకే. కాకపోతే వారిద్దరిలో ఒకరు తదుపరి ఎన్నికలలో ఓటమి పాలైతే, మరొకరు బిజెపిలో చేరిపోయారు. తన ఎమ్.పిలు నలుగురు బిజెపిలో చేరడానికి చంద్రబాబే ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో కూడా చెప్పాలి. 

జగన్ కేసుల కోసమే రాజీ పడ్డారని ఆరోపిస్తుండే చంద్రబాబు తాను దేనికోసం బిజెపితో రాజీపడి వారి స్నేహం కోసం అర్రులు చాస్తున్నది చెబితే బాగుంటుంది.చంద్రబాబు ప్రత్యేక హోదా పదిహేనేళ్లు కావాలని అడిగి, తదుపరి దానివల్ల ఏమి ప్రయోజనం ఉందని ప్రశ్నించేవారు. అప్పుడు ఈనాడు ఆయనను తప్పు పట్టిందా? తిరిగి ప్రత్యేక హోదా డిమాండ్ ను తలకెత్తుకున్నప్పుడు ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చావని ఈనాడు ప్రశ్నించిందా?  ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదాపై బిజెపిని, వైసిపిని తీవ్రంగా విమర్శిస్తూ ప్రచారం చేయవచ్చు కదా? ఆయన ఎందుకు ఆ ధైర్యం చేయలేకపోతున్నారో అర్దం చేసుకోవడం కష్టం కాదు. ఈనాడుకు ఆ సంగతులు తెలియవని కాదు. అసలు ఇక్కడ ఒక మాట చెప్పాలి. నిజంగానే ఈనాడుకు ఎపి ప్రజలపట్ల ప్రేమాభిమానాలు ఉంటే, వారికి రాజకీయ దురుద్దేశాలు లేకుంటే ప్రత్యేక హోదాను ఒక ఉద్యమంగా చేపట్టవచ్చు. 

ఆ మాటకు వస్తే ఈనాడు అదినేత రామోజీరావు కు పద్మవిభూషణ బిరుదును ప్రకటించినప్పుడు ఎపికి ప్రత్యేక హోదా ఇస్తేనే, విభజన హామీలు నెరవేర్చితేనే తాను ఆ అవార్డు తీసుకుంటానని చెప్పి ఉంటే హీరో అయి ఉండేవారు కదా? 1992 లో రామోజీరావు తన పత్రికలో రెండు పేజీలు కేటాయించి మద్య నిషేధ ఉద్యమం ప్రచారం చేశారు. ఉద్యమం జరిగినా, జరగకపోయినా, ఏదో అయిపోతోందన్న భావన కలిగించడంలో ఆయన సఫలం అయ్యారు. సరే..ఆ తర్వాతకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక , మద్య నిషేధాన్ని ఎత్తివేశాక ఈనాడు దాని ఊసే ఎత్తలేదు.అది వేరే విషయం. పోనీ ఆ రకంగా అయినా రామోజీరావు తనకు నచ్చని జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది కనుక , దీనిని ఒక అవకాశంగా తీసుకుని ప్రత్యేక హోదా డిమాండ్ సాధనకు గాను , 

మోదీకి, బిజేపీకి వ్యతిరేకంగా రెండు పేజీలు కేటాయించి, టీవీ చానళ్లలో ఒక గంట కేటాయించి ప్రచారం చేస్తే పేరు వస్తుంది కదా. ఈ క్రమంలో జగన్ ను ప్రశ్నించినా ఎవరూ కాదనరు. ఆ సాహసం చేయగల దమ్ము రామోజీకి ఉందా? లేదా? ఎంతసేపు జగన్ ప్రభుత్వంపై విషం చిమ్మాలన్న ఆలోచనతో కృత్రియంగా కల్పిత కదలు రాసి ప్రజలను మోసం చేయాలన్న దుష్ట తలంపే తప్ప ఈనాడు మీడియాకు చిత్తశుద్ది లేదన్నది వాస్తవం. 

-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top