అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే! | Kommineni Comments On Chandrababu And Amaravati Capital | Sakshi
Sakshi News home page

అమరావతి అప్పులు అందరికి... భూలాభం కొందరికే!

May 5 2026 12:22 PM | Updated on May 5 2026 4:07 PM

Kommineni Comments On Chandrababu And Amaravati Capital

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూస్తూంటే.. అప్పుచేసి పప్పు కూడు అన్న పాత సామెతను అప్పు చేసి అమరావతి సోకులు అని మార్చాల్సి వస్తుంది. పేదవాడికి అండగా నిలిచే లక్ష్యంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ గతి తప్పుతోంది. అమరావతిలో గత జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోట్లు వెచ్చించగల ధనికులకే పరిమితమన్న అభిప్రాయం బలపడుతోంది.

వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని గ్రామాలలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలకు ఎంతవరకు మేలు కలుగుతుందన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అవసరానికి తగ్గట్టు నిర్మాణాలు జరిపేందుకు అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ... అవగాహన లేకుండా లేచిందే లేడికి పరుగు అన్నట్టు ఒక నగరాన్ని సృష్టిస్తామన్న పాలకుల వ్యవహారమే మింగుడుపడటం లేదు.

ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశ నిర్ణయాలను పరిశీలిస్తే సామాన్యుడు ఎవరైనా విస్తుపోవాల్సిందే! అమరావతి నిర్మాణాల్లో కేవలం అద్దాలకు మాత్రమే రూ.2540 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది మంత్రివర్గం. అసెంబ్లీ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ వంతెనలకు రూ.798 కోట్ల వ్యయం చేయున్నారు. విశేషం ఏమిటంటటే ఇక్కడ నిర్మాణాల టెండర్లను మంత్రివర్గంలో ఆమోదించారట.

సాధారణంగా టెండర్ల ఆమోదం కేబినెట్‌ వరకు రాదు. కాని మంత్రులందరిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదో సందేహం ఉండి ఉండాలి. ఒకవేళ వచ్చే ప్రభుత్వం ఈ దోపిడీపై విచారణ చేస్తే మంత్రివర్గ నిర్ణయంగా తోసివేయడానికి ఉపయోగపడుతుందన్న భావన కావచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజధాని పేరుతో ఏ రాష్ట్రంలోను ఇంతలా డబ్బు వృథా చేయలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సైతం పార్లమెంటు భవన నిర్మాణానికి కేవలం రూ.1100 కోట్ల లోపు వ్యయం అయితే, ఏపీలో భవనాల అద్దాలకే  రూ.2540 కోట్లు  ఖర్చు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్టిన తెలంగాణ సచివాలయ భవనానికి అయిన ఖర్చు కూడా రూ.వెయ్యి కోట్ల లోపే.

డబ్బు ఉంటే ఎన్ని సోకులు అయినా చేసుకోవచ్చు. ఎవరూ తప్పుపట్టరు. కానీ... ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న ఆంద్రప్రదేశ్‌లో ఈ దుబారా చేయడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమే అవుతుంది. ఏ పని చేయాలన్నా, ఏ హామీ గురించి ప్రశ్నించినా, మెడికల్ కాలేజీల వంటి వాటిని ప్రైవేటు పరం చేయవద్దని చెప్పినా, డబ్బులు లేవని చెబుతారు. కాని అమరావతిలో మాత్రం లక్షల కోట్లు వ్యయం చేయడానికి రెడీ అయిపోయారు. ఇందుకోసం వేల కోట్ల అప్పులు చేసేశారు.  రాజధానిలో సచివాలయ సిబ్బంది కూడా మూడువేల మందికి మించి ఉండరు.

కాని సచివాలయం కోసం చదరపు అడుగుకు రూ.15 వేల వ్యయంతో నలభై, ఏభై అంతస్తుల భవనాలు నిర్మించడం అంటే అంతా విస్తుపోతున్నారు. నలభై ,ఏభై లక్షల చదరపు అడుగుల భవనం నిర్మించడమేమిటో తెలియకుండా ఉంది. ఇదంతా కాంట్రాక్టర్లను బాగు చేయడానికి, కిక్‌బ్యాక్‌లు పొందడానికే అని విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. అది చాలదన్నట్లుగా ప్లంబింగ్‌, డ్రైనేజీ, విద్యుత్ తదితర సదుపాయల కల్పనకు మరికొన్ని వేల కోట్లు, చివరికి అద్దాలు అమర్చడానికి రూ.2540 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు.

ఈ భవనాల నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వపరంగా వాడుకోవడానికి ఆ స్థాయిలో సిబ్బంది ఉండకపోవచ్చు. అందువల్ల  ఈ భవనాలలో అత్యధిక భాగం అద్దెకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందేమో తెలియదు.  జాతీయ రహదారికి నలభై కిలోమీటర్ల దూరం వచ్చి కంపెనీలు అద్దెకు తీసుకునే పరిస్థితి ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు.పైగా ప్రభుత్వ భవనాలలో ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు.  అలాంటప్పుడు  ఇన్ని భారీ భవనాల నిర్మాణం ఎందుకు చేపడుతున్నారో తెలియదు.

ఇక అసెంబ్లీ భవన నిర్మాణానికి కూడా వేల కోట్ల వ్యయం జరుగుతుంది.నిజానికి అసెంబ్లీ సమావేశాలు జరిగేదే ఏడాదికి ముప్పై రోజులు కూడా ఉండడం లేదు. ఒకప్పుడు 45 రోజులైనా సభ జరగాలని అనేవారు. ఇప్పుడు అడిగేవారు కూడా లేరు. మొత్తం 300 లేదా 400 మంది కూర్చోవడానికి, భారీ స్థాయిలో భవంతి నిర్మించడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదు. పోనీ కమిటీ సమావేశాలకు అవసరమవుతాయని అనుకున్నా, అవి కూడా ఎంత మేర పని చేస్తాయో చెప్పలేం. ఆ సమావేశాలకు జరగడానికి రెండు లేదా మూడు సమావేశ మందిరాలు సరిపోతాయి. అయినా అసెంబ్లీ భవనానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తున్నారు.

మరో 4వేల కోట్లు.. అప్పుల్లో ఆల్ టైం రికార్డు

అమరావతి భవనాల డిజైన్ కోసమే రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా ఎందుకు  చేస్తున్నారు.ఈ టవర్లపై ఎక్కి నగరాన్ని చూసే సదుపాయం కల్పిస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. దానికోసం ఇన్నివేల కోట్లు వ్యయం చేయాలా?  ప్రభుత్వం తన సొంత భూములలో నిర్మాణం  చేస్తే అదో పద్దతి. రైతుల నుంచి వారి ఇష్టపూర్వకంగానో,లేక బలవంతంగానో భూమి సమీకరించారు.వారికి కౌలుతోపాటు పలు హామీలు  ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చుతో లే అవుట్ లు వేసి,  మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలి.

ఇందుకోసం ఒక ఎకరాకు రూ.రెండు కోట్లు అవుతుందని, ఏడేళ్ల క్రితమే చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది. కేంద్రం దీనిపై స్పందించలేదు. కాకపోతే ఈ టర్మ్‌లో ప్రపంచ బ్యాంక్,  ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది. అప్పు  తీర్చవలసిన  బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే. అంటే ఏపీ ప్రజలు వడ్డీతో సహా అప్పులు చెల్లించవలసిందే. అంటే రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలవారు ఐదు కోట్ల మంది ఈ మొత్తానికి బాధ్యులైతే, ఇక్కడ పెరిగే  భూముల విలువ వల్ల లబ్ది పొందేది కొన్నివేల మంది మాత్రమే. ఇదంతా ఉపాధి కేంద్రం అవుతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా, ఆ స్థాయిలో ఇక్కడకు వస్తున్న కొత్త సంస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలకు 99 పైసలకే భూములు ఇస్తున్న నేపథ్యంలో అమరావతిలో పరిశ్రమల స్థాపనకు ఎంతమంది ముందుకొస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.  ఒకవేళ వచ్చినా ఇక్కడ కూడా అలాగే ఉచితంగా భూములు ఇవ్వగలుగుతారా? అలా చేస్తే అమరావతి ద్వారా ఆదాయం  కూడా రాదు కదా! విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. అమరావతిలో ఆ పరిస్థితి లేదు.దానికితోడు   కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అమరావతిని కమ్మరావతి  అని గొప్పగా చెప్పి రాజధాని పరువు తీశారు.  ఇతర సామాజికవర్గాలలో ఆమెకు తెలియకుండానే వ్యతిరేకత సృష్టించారు. ఇది ఒక కోణం అయితే  ఇప్పటికే ఉన్న  అసెంబ్లీ, సచివాలయం వంటివాటిని మళ్లీ నిర్మించడం ద్వారా వృథా వ్యయం చేస్తున్నారన్న  విమర్శ ఉంది.

ఇవే కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలలో ఉన్న రైల్వేస్టేషన్లు  కాదని అమరావతి గ్రామాలలో కొత్త రైల్వే స్టేషన్, గన్నవరంలో ఉన్న విమానాశ్రయం కాకుండా ఇంకో ఎయిర్ పోర్టు నిర్మించాలని తలపెట్టడం ఏ మేరకు తెలివైన నిర్ణయం అవుతుంది?  టీడీపీకి గట్టి మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి వెంకటేశ్వరరావు రెండో దశ పూలింగ్ నిమిత్తం భూములు తీసుకోవడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించారు.అయినా ప్రభుత్వం వేల ఎకరాల సేకరణకు ముందుకు వెళుతుంటే  రైతులు అల్లాడుతున్నారు.ఇంతవరకు తొలిదశ రైతులకు హామీ ఇచ్చిన  రీతిలో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. మరో వైపు పేదలకోసం జగన్ ప్రభుత్వం ఇచ్చిన 50వేల ఇళ్ల స్థలాలను రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వ వైఖరి తెలియచేస్తుంది.

రాజధానిలో పెద్ద, పెద్ద ప్లాట్లు మాత్రమే ఉండాలన్న వారి ధనిక మనస్తత్వానికి అద్దం పడుతున్నదన్న వ్యాఖ్యలు  వస్తున్నాయి.  అమరావతి గ్రామాలలో భూములలో మట్టి స్వభావం కారణంగా పునాది నుంచి అధిక వ్యయం చేయవలసి వస్తోంది.  చాలామంది విజయవాడ-గుంటూరు మద్య గట్టి నేలల్లో అవసరమైన  భవనాలు నిర్మించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చినా వినకుండా చంద్రబాబు సర్కార్ తన ఇష్టారాజ్యంగా లక్షల కోట్లు ఒక ప్రాంతంలోనే ఖర్చు చేయడానికి సిద్దపడుతోంది.

జగన్ చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ వల్ల ఇన్ని లక్షల కోట్ల అవసరం ఉండదు.ఆ విషయం జనంలోకి వెళుతుండడంతో దానిపై వ్యతిరేక ప్రచారం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోంది. సాధారణంగా ఆర్థిక కష్టాలలో ఉన్నవారు పొదుపుగా వ్యవహరించాలని అంతా సలహా ఇస్తారు. కాని ప్రభుత్వమే ఇలా దుబారా వ్యయం చేస్తుంటే, ఎవరి మాట విననంటుంటే ప్రజలు  నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవల్సిందేనా? 


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement