లీకు వార్తలు.. ఫేక్‌ ప్రచారాలు | Harish Rao comments on Congress Govt | Sakshi
Sakshi News home page

లీకు వార్తలు.. ఫేక్‌ ప్రచారాలు

Apr 2 2024 6:06 AM | Updated on Apr 2 2024 6:06 AM

Harish Rao comments on Congress Govt - Sakshi

మాట్లాడుతున్న తన్నీరు హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ధ్వజం

హామీలు నెరవేర్చలేక రోజుకో కొత్త నాటకం.. బీజేపీతో కలిస్తే జోడీ.. లేదంటే ఈడీ దాడి

పదేళ్లలో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: హామీలు అమలు చేయలేక రోజుకో కొత్త నాటకంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అన్నీ లీక్‌ వార్తలు, ఫేక్‌ ప్రచారాలే తప్ప హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయారని విమ ర్శించారు. పదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేని బీజేపీ మరోసారి రాముడు, దేవాలయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజాలని చూస్తోందని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ ఎస్‌ పార్టీలో కీలక పదవులు అనుభవించిన నేత లు అవకాశవాద రాజకీయాలతో పార్టీలు మారి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండ జిల్లా చింతగట్టు క్యాంపు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో.. బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అ«ధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాకతీయ తోరణాన్ని ముట్టుకోవద్దు 
కాంగ్రెస్‌ నాయకులు ఏదో ఉద్ధరిస్తారని ప్రజలు అనుకుంటే.. వంద రోజుల్లో ఉద్దెర మాటలే తప్ప ఉద్ధరించింది ఏమీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ చిహ్నాలు, గుర్తులను చెరిపేయా లని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు. సీఎం రేవంత్‌ సర్కార్‌ కాకతీయ తోరణాన్ని ముట్టు కుంటే వరంగల్‌ జిల్లా అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్‌ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని అభివర్ణించారు. 

రాముడికి అందరం మొక్కుతాం
‘మాట వింటే జోడీ.. వినకపోతే తెల్లారే ఈడీ దాడి’ అనే విధంగా పదేళ్లలో దేశంలో రాజకీయ పరిస్థితిని బీజేపీ మార్చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. బీజేపీ పాలనలో దేశంలో ఆకలి, పేదరికం, నిరు ద్యోగం పెరిగిపోయాయన్నారు. ‘బీజేపోళ్లు ఏమన్నా అంటే రామాలయం అంటారు. రాముడికి అందరం మొక్కుతాం. మనం కూడా హనుమాన్‌ చాలీసా చదువుతాం. బీజేపోళ్లకు వస్తదో.. రాదో తెల్వదు కానీ.. నేను హనుమాన్‌ చాలీసా రెండు నిమిషాల్లో చదువుతాను (చదివి వినిపించి)’ అని చెప్పారు.

హరీశ్‌ కాళ్లపై పడిన కార్యకర్త
సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా ఓ కార్యకర్త వేగంగా స్టేజీపైకి చేరుకుని ఆయన కాళ్లపై పడ్డారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది. నేతలు, గన్‌మన్లు కలిసి అతన్ని కిందికి దింపారు.

కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పాలి
పార్లమెంట్‌ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున అసెంబ్లీకి ఎన్నికైన ఆయ న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డిని దొంగతో పోల్చి, చివరకు ఆ దొంగతోనే కాంగ్రెస్‌ కండువా కప్పించుకున్నా రని, ఈ వయసులో ఇంత దిగజారుడు రాజ కీయాలు అవసరమా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ ఎస్‌ తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీని వాస్‌ రెడ్డి, బçస్వ రాజు సారయ్య, మాజీ స్పీకర్‌ మధుసూద నాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు «గండ్ర వెంకటరమణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement