కరీంనగర్‌ను బొందలగడ్డ చేసినవ్‌: మాజీ మంత్రి ఈటల | Etela Fire On Minister Gangula Kamalakar | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ను బొందలగడ్డ చేసినవ్‌: మాజీ మంత్రి ఈటల

May 19 2021 4:29 AM | Updated on May 19 2021 8:15 AM

Etela Fire On Minister Gangula Kamalakar - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. మంగళవారం ఆయన హుజూరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేరు ప్రస్తావించకుండానే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌పై ధ్వజమెత్తారు. ‘మంత్రి అయిన తరువాతైనా నీకు సంస్కారం వస్తుందనుకున్నా. బిడ్డా.. గుర్తుపెట్టుకో ఎవ్వడూ వెయ్యేళ్లు బతకడం కోసం పుట్టలె. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. నీకు కరీంనగర్‌ ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజలందరినీ చల్లగా చూడమని తప్ప, హుజూరాబాద్‌ ప్రజానీకాన్ని వేధించమని, నాయకులని బ్లాక్‌మెయిల్‌ చేయమని కాదు.

నువ్వు ఏ సంప్రదాయాన్ని ప్రజలకు చూపిస్తున్నవో రేపు నీకు అదే గతి పడతది’ అని ఈటల నిప్పులు చెరిగారు. ‘కరీంనగర్‌ జిల్లాలో ఎన్ని గుట్టలు బొందల గడ్డగా మారిపోయాయో.. ఎన్ని వందల కోట్ల సంపద ధ్వంసం అయిందో, ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల పన్నులు ఎగ్గొట్టావో తెలుసు. నీ చరిత్ర ముఖ్యమంత్రికి కూడా చెప్పిన. నీకు పైరవీ వల్ల పదవి వచ్చింది. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే 2023 తర్వాత నువ్వు ఉండవు. నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏ పనైతే చేస్తున్నవో నేను అదే పనిచేస్తా.. ఖబడ్దార్‌’ అని గంగులను హెచ్చరించారు. ‘మీరు చేసిన పనికి కొంతమంది సర్పంచ్‌లు, కౌన్సిలర్లు సమాజం ఎదుట దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. చిల్లరమల్లర వేషాలను ఇకనైనా పక్కన పెట్టాలి. ఈ దాదాగిరి, హెచ్చరికల్ని ఆపేయకపోతే కరీంనగర్‌ కేంద్రంగానే ఉద్యమం చేయాల్సి వస్తుంది. మా ఓపికను పరీక్షించే ప్రయత్నం చేస్తే మాడి మసైపోతరు’ అని ఈటల ఘాటుగా వ్యాఖ్యానించారు.

నాకు నష్టం చేయి.. నా ప్రజలకు కాదు 
 ‘అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి జీవించే నియోజకవర్గం హుజూరాబాద్‌. నా మీద కక్షతో గోదాములు సీజ్‌ చేయొచ్చు, పౌల్ట్రీలు సీజ్‌ చేయొచ్చు. కానీ మా ప్రజల్ని వేధించవద్దని కోరుతున్నా. నేను దేవుళ్లకు మొక్కను, ప్రజలకు మొక్కుతా. కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఉన్న మా ప్రజలను వేరుచేసే విధంగా వ్యవహరిస్తున్నారు. నేను చాలెంజ్‌ చేసి చెప్తున్నా. అంతటా నడిసినట్టు ఇక్కడ రాజకీయాలు నడవవు’ అని ఈటల స్పష్టం చేశారు. 

ఏ ఇన్‌చార్జి వచ్చినా.. ఇది హుజూరాబాద్‌ 
‘మా సహచరుడు, మంత్రి ఇక్కడ ఇన్‌చార్జిగా వచ్చినట్లు నిన్ననే టీవీలో చూసిన. నువ్వు ఎక్కడికిపోతే అక్కడ గెలిపిస్తవ్‌.. ఎక్కడపడితే అక్కడ రాజకీయాలు నడుపుతవ్‌.. కానీ హుజూరాబాద్‌ ప్రజల్ని ఎవరూ కొనలేరు. ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ అంచనా వేయలేరు. మీరు నాగార్జునసాగర్‌లో చేసినట్లు చేస్తమంటే ఇక్కడ ప్రజలు పాతరేస్తరు. మొన్న కూడా దుబ్బాకలో గిట్లనే చేసిన్రు. అందరు సర్పంచులు, ఎంపీటీసీలు మా వైపే, నాయకత్వమంత మా వైపే అన్నరు. కానీ.. ప్రజలు మరోవైపు ఉంటరు. ఎన్నిక వస్తే హుజూరాబాద్‌ ప్రజలు రాజేందర్‌ తోనే నడుస్తరు’ అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఇల్లందకుంట, హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్‌ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 

స్వగ్రామంలో మహిళల మంగళహారతులు 
కమలాపూర్‌: ఈటల రాజేందర్‌ మంగళవారం తన స్వగ్రామమైన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తన ఇంటికి వెళ్లి తండ్రి మల్లయ్య యోగక్షేమాలు ఆరాతీసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయ్యాక తొలిసారి స్వగ్రామానికి వచ్చిన రాజేందర్‌కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement