రచ్చే.. చర్చ వద్దు

Chandrababu direction To TDP Leaders on AP Assembly sessions - Sakshi

ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఎలా గొడవ చేయాలనే విషయంపై రోజంతా మంతనాలు

రాజధాని అంశంపైనే రగడ చేయాలని నిర్ణయం

15 రోజులు సభ జరపాలని పట్టుబట్టాలని బాబు సూచన

తాను సభకు రానని వెల్లడి

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు స్తంభించేలా గొడవ చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం బిల్లు పెట్టినా, చర్చ పెట్టినా అందులో పాల్గొనకుండా అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్‌ చేయాలని పదే పదే స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు చర్చలు జరిపారు.

సభకు ఆటంకం కలిగించేలా ఏం చేయాలనే విషయంపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు. మూడు రాజధానుల అంశాన్ని రిఫరెండంగా తీసుకుని అసెంబ్లీని రద్దు చేయాలనే డిమాండ్‌ను శాసన సభ, మండలిలో పెట్టి దానిపైనే గొడవ చేయాలని నిర్ణయించారు. సభ జరగకుండా అడ్డుకోవాలని, ఇందుకోసం మొదటి రోజే మూడు రాజధానులపై అసెంబ్లీ రద్దు డిమాండ్‌ను  లేవనెత్తి అధికారపక్షాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు.

గత సమావేశాల్లో శాసన సభ నిబంధనలకు విరుద్ధంగా సభలోకి చిడతలు తీసుకెళ్లి వాయించినట్లు ఈసారి కూడా అలాంటిది ఏదైనా చేసి సభను అడ్డుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. నిరుద్యోగం – యువత ఆందోళన, జగన్‌ పాలనలో పన్నుల బాదుడు, వరి వేసుకుంటే ఉరే, ఇసుక, మద్యం దోపిడీ వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టాలని చంద్రబాబు సూచించారు. వీటిపైనా చర్చకు పట్టుబట్టి గొడవకు దిగాలని సూచించినట్లు తెలిసింది.

శాసనమండలిలోనూ ఇవే అంశాలను లేవనెత్తి సభను అడ్డుకోవాలని సూచించారు. గొడవ చేయడం ద్వారానే మీడియాలో ఫోకస్‌ అవ్వాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని బీఏసీలో డిమాండ్‌ చేయాలని, తక్కువ రోజులు సమావేశాలు జరపడాన్ని ప్రశ్నించాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. గతంలో చెప్పినట్లుగానే అసెంబ్లీ సమావేశాలకు తాను దూరంగా ఉంటానని చంద్రబాబు చెప్పారు. కానీ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తానని, వాటికి అనుగుణంగా పని చేయాలని సూచించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top