విద్యపైనా విషమా? విద్య వ్యాపారమైతే భవిష్యత్తే లేదు: మంత్రి బొత్స  | Botsa Satyanarayana Fires On TDP Some media organizations | Sakshi
Sakshi News home page

విద్యపైనా విషమా? విద్య వ్యాపారమైతే భవిష్యత్తే లేదు: మంత్రి బొత్స 

Nov 2 2022 2:50 AM | Updated on Nov 2 2022 8:39 AM

Botsa Satyanarayana Fires On TDP Some media organizations - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదింటి బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం తపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు రాజకీయ నేతల పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలలపై విషం చిమ్ముతూ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసేలా వ్యవహరించడం సరికాదన్నారు. విద్యా సంస్కరణలతో విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లకు తరలిపోతున్నట్లు ఓ పత్రికలో వచ్చిన కథనంపై మంత్రి బొత్స స్పందించారు.

వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉండగా 2,900 ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తే తాము వచ్చాక అన్నింటినీ పునరుద్ధరించినట్లు గుర్తు చేశారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని బలంగా విశ్వసిస్తూ సీఎం జగన్‌ ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. విద్యారంగం వ్యాపారం అయితే భవిష్యత్‌ ఉండదని, అందుకే 95 శాతం మంది పేదింటి బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. తన నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్లు మూతబడ్డాయో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్పాలని సవాల్‌  విసిరారు. 

రాష్ట్రంలో మూడేళ్ల క్రితమే శ్రీకారం
దివంగత వైఎస్సార్‌ ఆశయాల నుంచి ఆవిర్భవించిన వైఎస్సార్‌ సీపీకి విద్య, వైద్యం, వ్యవసాయం తొలి ప్రాధాన్య అంశాలని మంత్రి బొత్స తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌ 2019లోనే ఐఐఎస్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ అధ్యక్షతన విద్యా సంస్కరణల కమిటీని నియమించారని గుర్తు చేశారు.

ఉపాధ్యాయులు ఒకేసారి వివిధ స్థాయిల్లో బోధన చేయడం వల్ల ఒత్తిడి పెరిగి అనుకున్న ఫలితాలు రావడం లేదని, ప్రభుత్వ విద్య చిన్నాభిన్నమైందని గుర్తించిందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను మాత్రమే అత్యంత సమీపంలో ఉన్న హైస్కూల్‌ తరగతులతో విలీనం చేశామని, మిగిలిన తరగతులతో ప్రాథమిక పాఠశాలలు ఎప్పటిలాగే కొనసాగుతాయన్నారు.  

కళ్లున్న కబోదులు..
తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 44,570 ప్రభుత్వ పాఠశాలలు, 16 వేల ప్రైవేట్‌ స్కూళ్లున్నాయని బొత్స తెలిపారు. అయితే 55 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేట్‌  స్కూళ్లలో చదువుతుండగా ప్రభుత్వ పాఠశాలల్లో 45 శాతం కంటే తక్కువగా ఉన్నారని చెప్పారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చేనాటికి 40 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా 2018 నాటికి 37 లక్షలకు తగ్గిపోయిందని వెల్లడించారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా రంగ కార్యక్రమాలు, కార్పొరేట్‌ స్థాయి వసతుల కల్పనతో ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 41 లక్షలకు పెరిగిందని వివరించారు. నాడు – నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడంతో వచ్చిన మార్పులు కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తున్నా విపక్షాలు కబోదుల్లా దిగజారి మాట్లాడటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే స్కూళ్ల మ్యాపింగ్‌ చేపట్టి 250 మీటర్ల దూరంలో ఉన్న వాటిని విలీనం చేసినట్లు తెలిపారు.

సబ్జెక్టు టీచర్లతో బోధన
జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ), ఫౌండేషన్‌ లిటరసీ, నర్సరీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5+3+3+4 బోధనా విధానాన్ని సూచించిందన్నారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లలకు ప్రీ–స్కూల్‌/అంగన్‌వాడీ/బాలవాటిక, 6 – 8 ఏళ్ల పిల్లలకు ఒకటి, రెండో తరగతి విద్యను సూచించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఐదో తరగతి లోపు పిల్లలకు కూడా సబ్జెక్టు నిపుణులైన బీఈడీ ఉపాధ్యాయులతో బోధన నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ఈమేరకు చర్యలు తీసుకున్నామని, నిపుణులు లేనిచోట ఎస్‌జీటీల్లో అర్హులను అందుకు నియమిస్తామన్నారు. 2021–22లో పక్కపక్కనే ఉన్న 2,943 ప్రాథమిక పాఠశాలల తరగతులను 2,808 ఉన్నత పాఠశాల తరగతులతో అనుసంధానం చేశామన్నారు.  తరగతి గదులు, మౌలిక సదుపాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత 4,943 స్కూళ్లల్లో 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు అనుసంధానించామన్నారు.

మిగిలిన తరగతులతో ప్రాథమిక పాఠశాలలు యథావిథిగా కొనసాగుతాయని, ఏ ఒక్క స్కూలూ మూతపడలేదని వివరించారు. నిబంధనల ప్రకారం మ్యాపింగ్‌ చేసిన ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతుల బోధనకు 44,010 మంది సబ్జెక్టు నిపుణులు అవసరం కాగా ప్రస్తుతం 37,113 మంది అందుబాటులో ఉన్నారన్నారు. 5,713 సబ్జెక్టు ఉపాధ్యాయులను మాత్రమే మండలాల నుంచి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్హత కలిగిన 4,067 మంది ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు. అవసరానికి అనుగుణంగా నాడు–నేడు రెండో దశ కింద ౖ35,025 తరగతి గదులను సైతం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement