
సాక్షి, ఢిల్లీ: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు చేశారో స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో యుద్ధం చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఏ గల్లీలో కత్తి తిప్పాడో సమాధానం చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. (చదవండి: ‘తెలంగాణలో నయా రాచరికం’)
‘‘ఢిల్లీలో పొర్లు దండాలు పెట్టిన ఆయన అవినీతిపై విచారణ ఆగదు. త్వరలో జైలుకు వెళ్లడం ఖాయం. ప్రజల దృష్టి మరల్చడానికి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. రాష్ట్ర రైతాంగం, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండటంతో రైతుల ఆందోళనకు కేసీఆర్ వెళ్లలేదు. హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు బయటకు రాని సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీ వచ్చి వరద సహాయం అడుగుతున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికే కాళేశ్వరం లో మూడవ టీఎంసీకి అనుమతి అడుగుతున్నారు. డీపీఆర్ సమర్పించకుండా అనుమతి అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని’’ దుయ్యబట్టారు.(చదవండి: నయీం ఇంట్లో కళ్లు చెదిరే నిజాలు..!)
‘‘రూ.32 వేల కోట్లతో రెండవ దశకు అనుమతి తీసుకుని రూ.82 వేల కోట్ల అంచనాలకు పెంచారు. ఎందుకు అంచనాలు పెంచారో సమాధానం చెప్పడం లేదు. పైగా మా నిధులు మా ఇష్టం అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. మూడవ టీఎంసీ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. కేంద్ర జలశక్తి మంత్రికి ఒక లేఖ, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు మరో లేఖ రాశారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే కాళేశ్వరంలో మూడవ టీఎంసీకి అనుమతి అడుగుతున్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది. దానిని కప్పిపుచ్చుకోవడానికే ఢిల్లీ వచ్చి వంగి వంగి దండాలు పెడుతున్నారంటూ’’ విమర్శలు గుప్పించారు.
వరంగల్ ను కేంద్రం స్మార్ట్ సిటీగా ప్రకటించి 196 కోట్లు నిధులు విడుదల చేస్తే , రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో 196 కోట్లు విడుదల చేయలేదు. కేంద్రం ఇచ్చిన 196 కోట్లలో నిధులు దారి మళ్లించి అందులో 40 కోట్లు మాత్రమే విడుదల చేశారు. కేంద్ర వాటాకు సంబంధించిన లెక్కల కోసం మూడు సార్లు లేఖ రాస్తే , రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేదు. కేసీఆర్ వైఖరి వల్ల, ఆయన నిర్లక్ష్యం వల్ల వరంగల్ , కరీంనగర్ స్మార్ట్ సిటీల దాదాపు 1000 కోట్లు నిధులు రాలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట విమానాశ్రయం ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద జోక్ గా మారిందని’’ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన అట్టర్ ప్లాప్. ఆయన చెప్పిన కట్టుకథలు కేంద్ర మంత్రులు నమ్మలేదు. ఆయన పాచిక పారలేదని’’ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పి.. ఇప్పుడు మాట్లాడటం లేదు. ముందు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి, కొత్త ఉద్యోగుల భర్తీ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.