సాక్షి,చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (తమిళగ వెట్రి కళగం) అతి పెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా రాజకీయాలను శాసించిన ద్రవిడ పార్టీల కోటలను బద్దలు కొట్టి, ప్రజల తీర్పుతో కొత్త శక్తిగా ఎదిగింది. అయితే స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు కీలకమైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు విజయ్‌ను సంప్రదించాయి. అదే సమయంలో విజయ్ సైతం పలు పార్టీలతో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడం, మంత్రి వర్గంలో ఏ పార్టీకి చోటివ్వాలి. ప్రమాణ స్వీకారం తదిదర అంశాలపై స్పష్టత వచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
మిత్రపక్షాల ప్రతిపాదనలు
సీపీఎం, సీపీఐ, పీఎంకే, వీసీకే పార్టీలు విజయ్‌కు తమ ప్రతిపాదనలు పంపాయి.
పీఎంకే (పట్టాలి మక్కల్ కచ్చి) - నాలుగు స్థానాలు గెలుచుకున్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం.
సీపీఎం- భావజాల పరంగా టీవీకేకు దగ్గరగా ఉన్న ఈ పార్టీకి ఒక మంత్రి పదవి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
సీపీఐ - మరో వామపక్ష పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వీసీకే (విదుతలై చిరుతైగల్ కచ్చి)- సామాజిక న్యాయం కోసం పోరాడే ఈ పార్టీకి కూడా ఒక మంత్రి పదవి ప్రతిపాదించారని సమాచారం.
విజయ్ వ్యూహం
కేవలం బయటి నుంచి మద్దతు కాకుండా, మిత్రపక్షాలను నేరుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా స్థిరమైన పాలన అందించాలనేది విజయ్ వ్యూహం. గత 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎకే పార్టీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా విజయ్ ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు.
వినూత్న మంత్రివర్గం
మిత్రపక్షాల సీనియారిటీతో పాటు, తన పార్టీలోని యువ నాయకులను కలిపి ఒక వినూత్నమైన మంత్రివర్గాన్ని విజయ్ రూపొందిస్తున్నారు. ప్రజలు కోరుకున్న ‘మార్పు’ తీర్పును గౌరవిస్తూ, పాత రాజకీయ శక్తులకు దూరంగా ఉండాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు.
ముఖ్యమంత్రి పదవికి విజయ్
అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ గురువారం (మే 7)న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.


