కూలిపోయిన ఉపాధి
మంథనిరూరల్: చేపల వేటతో తమ కుటుంబాలను పోషించుకుంటున్న వందలాది మంది మత్స్యకారులకు ఇప్పుడు ఉపాధి లేకుండాపోయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో అడవిసోమన్‌పల్లి మానేరుపై చెక్‌డ్యాం నిర్మించింది. దీని నిర్మాణంతో సుమారు లక్ష క్యూసెక్కుల నీరునిల్వ ఉంటుండటంతోపాటు.. మూడేళ్లుగా వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. రెండు రోజుల క్రితం అది కూలిపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని పలువురు మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మానేరుపై 16 చెక్‌డ్యాంలు..
భూగర్భజలాల పెంపు, మత్స్య సంపదను పెంపొందించి, మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022లో జి ల్లాలోని మానేరుపై వివిధ చోట్ల 16 వంతెనల నిర్మాణానికి రూ.128కోట్లు వెచ్చించింది. శరవేగంగా వాటి నిర్మాణాలు పూర్తిచేసింది. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం అడవిసోమన్‌పల్లి, చిన్నఓదాల, గోపాల్‌పూర్ గ్రామాల మధ్య మానేరుపై సుమారు రూ.16 కోట్ల వ్యయంతో మూడు చెక్‌డ్యాంలు ని ర్మించింది. ఇందులో అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం రెండు రోజుల క్రితం కుప్పకూలిపోయింది.
చేపలు పట్టుకుని జీవనోపాధి..
చెక్‌డ్యాం నిర్మాణంతో నీటినిల్వలు వృద్ధి చెందాయి. తద్వారా చేపలకు ఆవాసం ఏర్పడింది. అనేకమంది చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. లక్ష క్యూసెక్కల మేర నీటి నిల్వ ఉండటంతో మూడేళ్లపాటు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని మత్స్యకారులు చేపలు పట్టుకునేవారు. నిత్యం వంద నుంచి దాదాపు 150 క్వింటాళ్ల వరకు చేపలు పట్టుకుని విక్రయించే వారని, తద్వారా ఈ ప్రాంతంలోని దాదాపు 200 కుటుంబాలు ఉపాధి పొందుతుండేవని స్థానికులు చెబుతున్నారు.
అనేక అనుమానాలు..
అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాం కూలిపోవడంపై స్థానికులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికే ఇరిగేషన్ అధికారులు చెక్‌డ్యాం కూలడంపై విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే కూల్చివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తాము ఉపాధి కోల్పోయా మని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


