సింగరేణి ‘పొదుపు మంత్రం’
ఏరియాల వారీగా కేటాయించిన బడ్జెట్(రూ.లక్షల్లో)
గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఎంతోహంగూ ఆర్భాటాలతో ఉత్సవాలు నిర్వహించగా.. ఈసారి జీఎం కార్యాలయాలకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఒక్కో ఏరియాకు గతంలో కేటాయించిన బడ్జెట్‌లో 70శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
రూ.3.38లక్షల నుంచి రూ.60వేలకు..
ఆర్జీ–1 ఏరియాకు గతంలో రూ.3.38లక్షలు కేటాయించగా తాజాగా రూ.60వేలు కేటాయిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగిన సీఎండీ ఎన్.బలరాం స్థానంలో కొత్త సీఎండీగా ఐఏఎస్ అధికారి దేవరరకొండ కృష్ణభాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో సింగరేణి ఆర్థిక వనరులను పొదుపుగా వినియోగించుకోవాలనే ఆలోచనతో ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజా సర్క్యులర్ ప్రకారం సింగరేణి మొత్తమ్మీద 15ప్రాంతాలకు రూ.8లక్షలు మాత్రమే కేటాయిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేయడం గమనార్హం. గతంలో ఒక్కో ఏరియాకు రూ. 3.50లక్షల వరకు కేటాయించే పద్దతి కొనసాగిది.
ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినా..
వాస్తవానికి సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించి గతనెల 29న ఏరియాల వారీగా బడ్జెట్ కేటాయిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం.. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ఆటలు, వెల్‌బేబీ షో, ఉత్తమ గృహాలు, దీపాలంకరణ తదితర పోటీలను ఏరియాల వారీగా నిర్వహించారు. ఇంకాకొన్ని పోటీలు నిర్వహించాల్సి ఉంది. ఈలోగా తాజా జీవోతో ఉత్కంఠ నెలకొంది.
తలలు పట్టుకుంటున్న అధికారులు..
పాత ఉత్తర్వుల ప్రకారం.. ఏరియాల వారీగా ఇప్పటికే వివిధ పోటీలు నిర్వహించారు. ఇందులో వెల్‌బేబీ షో, ఉత్తమ గృహాలంకరణ, ఎన్విరాన్‌మెంట్ క్వార్టర్లు, బెస్ట్‌సేవా సభ్యులు తదితర పోటీల్లో విజేతలను కూడా ఎంపిక చేశారు. గత బడ్జెట్ పూర్తిగా తగ్గించడంతో ఇప్పటివరకు నిర్వహించిన పోటీలకు బడ్జెట్ ఎలా సరిపెట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. నిధుల్లో కోత విధించడంతో వేడుకలపై ప్రభావం ఉంటుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సంబంధం లేని ఆటలకు రూ.10కోట్లు?
సింగరేణికి సంబంధం లేని ఆటలకు సింగరేణి యాజమాన్యం రూ.10కోట్లు కేటాయించిందని, సింగరేణి ఆవిర్భావ వేడుకల కేటాయించే నిధుల్లో భారీగా కోత పెట్టిందని కార్మిక సంఘాలు తప్పు పడుతున్నాయి. గతంలో మాదిరిగానే సింగరేణి డే ఘనంగా నిర్వహించాలని గుర్తింపు యూనియన్ నాయకులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఏరియా గతం ప్రస్తుతం
కార్పొరేట్ – 1.00
కొత్తగూడెం 3.38 0.60
ఇల్లెందు 2.25 0.50
మణుగూరు 3.38 0.60
భూపాలపల్లి 3.38 060
ఆర్జీ–1 3.38 0.60
ఆర్జీ–2 2.82 0.55
ఆర్జీ–3, ఏఎల్‌పీ 2.82 0.55
బెల్లంపల్లి 2.25 0.50
మందమర్రి 3.38 0.60
శ్రీరాంపూర్ 3.38 0.60
హైదరాబాద్ 0.56 0.20
సత్తుపల్లి – 0.50
నైనీ – 0.35
ఎస్టీపీపీ 0.67 0.25
మొత్తం 31.65 8.00
సాదాసీదాగానే సింగరేణి ఆవిర్భావ వేడుకలు
జీఎం కార్యాలయ ఆవరణల్లోనే ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు
బడ్జెట్ కేటాయింపులు తగ్గించిన యాజమాన్యం
సింగరేణి ‘పొదుపు మంత్రం’


