ఆర్భాటం లేదు
హంగు లేదు..
గత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజున ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ ర్యాలీ తీసి, డప్పుచప్పుళ్లతో, జనసమీకరణ చేసి నామినేషన్ దాఖలు చేసేవారు. అదే సందడి పోలింగ్ ముగిసేవరకు కొనసాగించేవారు. కానీ, ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులు కేవలం ప్రతిపాదిత సభ్యుడు, ఇద్దరు సాక్షులతో ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేయడం, గుట్టచప్పుడు కాకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎంత హడావుడి చేసినా, పోలింగ్ ముందు రోజు ఓటరును కలిస్తేనే ఫలితం ఉంటుందని అభ్యర్థులు భావించడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే ప్రచారం కోసం ఖర్చు చేయడం కంటే ఓటరును ప్రసన్నం చేసుకోవడానికే ఖర్చు చేయాలని అభ్యర్థులు భావిస్తుండడంతో గ్రామాల్లో గత ఎన్నికల్లో కనిపించిన జోరు కనిపించడం లేదని పల్లెవాసులు ముచ్చటించుకుంటున్నారు.
సాక్షి పెద్దపల్లి:
సర్పంచ్ ఎన్నికలు అంటే పల్లెల్లో షెడ్యూల్ విడుదల నుంచి ఫలితాల వెల్లడి వరుకు సందడి నెలకొంటుంది. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో గ్రామాల్లో ఎన్నికల ప్రచార జోరు గత ఎన్నికలతో పోలిస్తే హడావుడి లేదనే భావన కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఓటర్లు పేర్కొంటున్నారు. నామినేషన దాఖలు మొదలు, నియోజకవర్గ స్థాయి నేతల ప్రచారంతో గల్లీలో ప్రచారం హోరెత్తించే అభ్యర్థులు, నేడు కేవలం ప్రచారం కంటే ఓటరు ప్రసన్నం చేసుకోవడంపైనే ఫోకస్ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియా వేదికగా వాట్సప్ గ్రూప్‌లు ఏర్పాటు చేయడం, స్టేటస్‌లతో ప్రచారం హోరెత్తిస్తూనే, ఆయా గ్రామాలకు చెందిన కుల, యువజన సంఘాల వారితో రాత్రివేళల విందులు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ఇంటింటి ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నారు.
పెద్దమనుషుల ప్రసన్నం కోసం పాట్లు
భారీ ర్యాలీ, ప్రచారం కంటే గ్రామాల్లో మెజార్టీగా ఉన్న వివిధ కుల సంఘాలు, యువజన సంఘాలతో మమేకం అయ్యేందుకే అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ఆయా కులసంఘాల పెద్దమనుషులను ప్రసన్నం చేసుకుంటే సగం విజయం సాధించినట్లేనని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో ఆయా కుల సంఘాల పెద్దమనుషులను దావత్‌కు పిలిచి తమకు మద్దతు ఇవ్వలంటూ వారికి పార్టీలు ఇస్తున్నారు. గెలిస్తే కుల సంఘానికి సంబంధించిన గుడి కట్టిస్తాం అని తదితర హామీలు గుప్పిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం
గ్రామాల్లోని ఓటర్ల ఫోన్‌నంబర్లు సేకరిస్తూ, వారందరితో ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అందులోనే వివరిస్తూ, తమ గుర్తును ఓటర్లకు తెలిసేలా తమ అనుచరులతో స్టేటస్‌లతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ, గ్రామం నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి పంపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల రోజు రావాలని, రానుపోను ఖర్చులు భరిస్తామంటూ అభ్యర్థిస్తున్నారు.
గతంలో వలె పల్లెల్లో కానరాని ప్రచార సందడి
సాదాసీదాగానే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ
నేరుగా ఓటరును ప్రసన్నం చేసుకునేందుకే ఆసక్తి
సోషల్‌మీడియానే ప్రధాన ప్రచార అస్త్రంగా వినియోగిస్తున్న అభ్యర్థులు


