ఆన్‌లైన్‌లో వాటర్ ట్యాక్స్
కోల్‌సిటీ(రామగుండం): వాటర్ ట్యాక్స్ చెల్లింపులు ఇప్పుడు సులభతరమయ్యింది. మాన్యువల్ పద్ధతికి చెక్ పెట్టారు. ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో నల్లా బిల్లు చెల్లించే సౌలభ్యాన్ని రామగుండం నగరపాలక సంస్థ అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. గురువారం కార్యాలయంలో కమిషనర్ జె.అరుణశ్రీ హ్యాండ్ హెల్డ్ మిషన్ ద్వారా నల్లా బిల్లు స్వీకరించి మొదటి రశీదు వినియోగదారుకు అందజేశారు.
మాన్యువల్‌తో ఇబ్బందులు
నల్లా కనెక్షన్ వినియోగదారులు ఇప్పటివరకు నగరపాలక కార్యాలయం కౌంటర్‌లో, బిల్‌కలెక్టర్‌కు నగదు చెల్లించి మాన్యువల్ ద్వారా రశీదు పొందేవారు. మరోసారి బిల్లు చెల్లించేటప్పుడు నల్లా కనెక్షన్ జారీ చేసిన సందర్భంగా ఇచ్చిన పాస్‌బుక్, పాత రశీదు అవసరమై ఉండేది. దీంతో పాత రశీదులు దొరక్కపోవడంతో వినియోగదారులు బిల్లులు చెల్లించినా బకాయి ఉన్నట్లు కొన్నిసార్లు రికార్డుల్లో సకాలంలో వివరాలు నమోదు కాక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులోకి రావడంతో కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, సీడీఎంఏ వెబ్‌సైట్ ద్వారా ఎక్కడి నుంచైనా నగదురహితంగా బిల్లు చెల్లించవచ్చు. వార్డు అధికారి వద్ద హ్యాండ్ హెల్డ్ మిషన్ ద్వారా చెల్లించి ఆన్‌లైన్ రశీదు పొందవచ్చు. కాగా నగరపాలక పరిధిలో 40,244 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, సీనియర్ అసిస్టెంట్ సాగర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శంకర్‌రావు, మెప్మా టీఎంసీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభించిన బల్దియా కమిషనర్
మాన్యువల్ బిల్లులకు చెక్


