చెరువులో పడి వృద్ధుడి మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో ఆవుల పెద్దరాజయ్య(72) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. సోమవారం బహిర్భూమికి వెళ్లిన పెద్దరాజయ్య.. చెరువులోకి దిగగా కాలుజారి నీటమునిగి మృతిచెందాడు. మృతుడు కుమారుడు ఆవుల కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పొత్కపల్లి ఎస్సై వివరించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ..
ఇల్లందకుంట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ గోపాల్‌పూర్‌కు చెందిన నిమ్మల శివశంకర్ రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కూతురు సాయి సుప్రజ (25)ను, ఇల్లందకుంటకు చెందిన గోడిశాల విక్రమ్ (28)తో ఫిబ్రవరిలో జరిగింది. వివాహ సమయంలో అన్ని కట్న కానుకలు అందించారు. కొన్నినెలలుగా అదనపు కట్నం తీసుకురావాలని సుప్రజను భర్త విక్రమ్, అత్త పుష్ప వేధింపులకు పాల్పడుతున్నారని బంధువులు ఆరోపించారు. ఈనెల 2న బాత్‌రూంలో సుప్రజ జారిపడిందని బంధువులకు విక్రమ్ సమాచారం అందించాడు. చికిత్స కోసం జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలింగా ఆమె అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. సుప్రజ మృతిపై అనుమానం ఉందని, తమ కుమార్తె మృతికి కారణమైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి శివశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పేర్కొన్నారు.
● దుబాయిలో గుండెపోటుతో రుద్రంగి వాసి మృతి
రుద్రంగి(వేములవాడ): ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన వ్యక్తి గుండె ఎడారి దేశంలోనే ఆగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపెల్లి సతీశ్‌గౌడ్(38) ఉన్న ఊరిలో ఉపాధి లేక రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. కుటుంబ సభ్యులను చూసుకునేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కంపెనీలో సెలవు తీసుకొని తెల్లారితే ఫ్లైట్ ఎక్కి ఇంటికి వస్తాడనుకున్న సమయంలో మృత్యు ఒడికి చేరాడు. ఈనెల 1న గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని మంగళవారం రుద్రంగి తీసుకురానున్నారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వస్తున్నాడని సంతోషంతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు సతీశ్ మరణవార్త కడు దుఃఖాన్ని మిగిల్చింది. మృతుడికి తల్లిదండ్రులు పెద్దన్న, నర్సవ్వ, భార్య లావణ్య, కూతురు హాసిని, కుమారుడు శ్రీవర్ధన్ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
చెరువులో పడి వృద్ధుడి మృతి


