రీల్స్ చేస్తూ గోదావరిలో యువకుడి గల్లంతు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సమీప గోదావరి నదిలో ‘గోదావరి – గంగ స్నానం’ పేరిట మంథని మంట అనే యూట్యూబ్‌లో రీల్స్‌చేసే ఓ యువకుడు.. రోజూ మాదిరిగానే సోమవారం స్నానం కోసం గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. మంథని పాతబస్టాండ్ వెనకాల నివాసం ఉండే రావికంటి చంద్రశేఖర్ కుమారుడు సాయికృష్ట (30) బీటెక్ పూర్తిచేశాడు. ‘మంథని మంట’ పేరిట స్థానిక అంశాలపై రీల్స్ చేస్తూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. ఈక్రమంలో ‘గోదావరి– గంగస్నానం’ పేరిట రీల్స్ తీసి పిల్లలు, స్థానికులను ఉత్సాహ పరచడంతోపాటు ఈ ప్రాంత ప్రత్యేకతనూ పరిచయం చేశారు. ఇందుకోసం సాయికృష్ణ నిత్యం గోదావరి నదికి వెళ్లి స్నానం చేయడమే కాకుండా రీల్స్ తీస్తున్నారు. సోమవారం కూడా గోదావరిలోకి వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, మున్సిపల్, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మంథని ఎస్‌ఐ–2 సాగర్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమారస్వామి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, గతఈతగాళ్లు రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతన్నారు. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉండడంతో కార్తీకమాసంలో పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు లోతైన ప్రదేశానికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, గజఈతగాళ్ల ను అందుబాటులో ఉంచామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. కాగా, బాఽధిత కుటుంబంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు గోదావరి తీరాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.
రీల్స్ చేస్తూ గోదావరిలో యువకుడి గల్లంతు


