
మొక్కవోని దీక్షతోనే..
● మొక్కలను సంరక్షిస్తేనే పచ్చదనం ● ఈ ఏడాది లక్ష్యం 30 లక్షలు ● ఇప్పటివరకు నాటినవి 6.43 కోట్లు
పెద్దపల్లిరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఏటా చేపట్టే మొక్కల పెంపకం ప్రహసనంగా కాకుండా ప్రతీదానిని సంరక్షిస్తేనే పచ్చదనం కనిపిస్తుంది. సుమారు పదేళ్ల క్రితం అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు హరితహారం పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో హరితహారం కార్యక్రమానికి అప్పటి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే, ఆయన అప్పుడు నాటిన మొక్క ఇప్పుడు కనిపించకుండా పోయింది.
కాంగ్రెస్ పాలనలో వనమహోత్సవం..
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. వన మహోత్సవం పేరిట మొక్కలు నాటి సంరక్షించేలా బృహత్ కార్యక్రమం చేపట్టింది. జాతీయస్థాయిలో 76వ వన మహోత్సవం కాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10వ వనమహోత్సవ కార్యక్రమం ఇది. ఈ ఏడాది జిల్లాలో 30లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఎంచుకుని ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు ముందుకు సాగుతున్నారు. అయితే నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలంటూ కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఆయన సూచిస్తున్నారు.
14.80 శాతం విస్తీర్ణంలోనే అడవులు
జిల్లాలో 13 మండలాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 2,15,695 హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం కలిగివున్న జిల్లాలో అటవీ విస్తీర్ణం 31,922 హెక్టార్లుగా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇది 14.80 శాతంగా నమోదై ఉందని పేర్కొంటున్నారు. పెద్దపల్లి, మంథని ఫారెస్టు సెక్షన్లు కలగిఉండగా 40 బీట్లు ఏర్పాటు చేశారు. 2016 నుంచి 2024 వరకు 7కోట్ల 21 లక్షల 39వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అధికారులు.. 6 కోట్ల 43 లక్షల 30వేల మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాటిలో 50 నుంచి 60శాతం మేర మొక్కలను సంరక్షించినట్లు అంచనా వేస్తున్నారు.
వనమహోత్సవం ఆవిర్భావమిలా..
1950లో అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి కేఎం మున్షీ వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా జూలై మొదటివారంలో నిర్వహిస్తున్నారు. విరివిగా మొక్కలను నాటి పెంచడం ద్వారా పచ్చదనం పెంచాలనే ఆలోచనతో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు అటవీ సంపదను పెంపొందించాలన్నదే లక్ష్యం. ఈ ఏడాది సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 7న రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చే శారు. అదేరోజు స్థానిక ఎమ్మెల్యే విజయరమణా రావు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని ఎలిగేడు ప్రా థమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వనమహోత్సవ వివరాలు..
సంవత్సరం లక్ష్యం నాటినవి (లక్షల్లో) (లక్షల్లో)
2016 70.80 89.92
2017 100.30 91.62
2018 110.00 147.30
2019 195.50 84.79
2020 79.77 74.73
2021 43.71 47.17
2022 43.71 46.18
2023 31.64 33.40
2024 27.08 28.18
2025 30.46 –
పర్యావరణాన్ని కాపాడేందుకే
వనమహోత్సవం ద్వారా నాటిన ప్రతీ మొక్కను కాపాడేలా చర్యలు చేపడుతున్నాం. శాఖల వారీగా మొక్కలను నాటించడంతోపాటు ప్రజలను భాగస్వాములుగా చేసి మ రిన్ని నాటేలా ప్రోత్సహిస్తున్నాం. మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపొందడంతోపా టు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. – శివయ్య, జిల్లా అటవీ అధికారి

మొక్కవోని దీక్షతోనే..