డీపీఆర్‌ తయారీలో అగ్రగామి | - | Sakshi
Sakshi News home page

డీపీఆర్‌ తయారీలో అగ్రగామి

Jun 24 2025 3:59 AM | Updated on Jun 24 2025 3:59 AM

డీపీఆ

డీపీఆర్‌ తయారీలో అగ్రగామి

రామగుండం: వ్యాప్కోస్‌ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరోసారి చర్చకు వచ్చిన పేరు. జీవితకాలం ముగిసిన మేడిపల్లి ఓపెన్‌కాస్టు గనిలో సింగరేణి 500 మెగావాట్ల సామర్థ్యం గల పంప్‌డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు.. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) తయారీ బాధ్యతలను వ్యాప్కోస్‌కు అప్పగించడం చర్చనీయాంశం కావడానికి కారణమైంది. ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్‌)తయారీలోనూ నిర్దేశిత గడువులోగా అత్యధిక కచ్చితత్వంతో ఈ సంస్థ ప్రత్యేకత చాటుకుంది. డ్యాంలు, పంపుహౌస్‌లు డిజైన్‌ చేసి అప్పగించడంలోనూ సత్తా నిరూపించుకుంది. మేడిపల్లి ఓసీపీలో చేపట్టిన పంప్‌డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జియాలాజికల్‌, జియో టెక్నికల్‌, హైడ్రాలజీ, సివిల్‌, ఉత్పత్తి సామర్థ్యం, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, పర్యావరణ, పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌, రక్షణ తదితర అంశాలపై డీపీఆర్‌ ఇవ్వాలని సింగరేణి వ్యాప్కోస్‌ను కోరింది.

వ్యాప్కోస్‌ అంటే..

వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఇండియా) లిమిటెడ్‌ను చిన్నగా వ్యాప్కోస్‌గా పిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నీటి వనరులు, విద్యుత్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ అధ్యయన రంగాల్లో సేవలు అందించే ఒక ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఇది. దీనిని 1969లో స్థాపించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వ్యాప్కోస్‌కు మినీరత్న సంస్థగా గుర్తింపు వచ్చింది. దేశ, విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టులకు సాంకేతిక సలహాలు, ఇంజనీరింగ్‌ సేవలు అందిచడంలో దిట్ట. ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌ కలిగిన సంస్థగా, గుణాత్మక సేవలకు నిదర్శనంగా పేరుంది.

దేశ, విదేశాల్లో కీలకపాత్ర..

● అఫ్ఘనిస్తాన్‌ హెరాత్‌ ప్రావిన్స్‌లోని సల్మాడ్యామ్‌ జలవిద్యుత్‌ ఆనకట్టను వ్యాప్కోస్‌ డిజైన్‌ చేసింది.

● భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరాకు జలజీవన్‌ మిషన్‌, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులూ డిజైన్‌ చేసింది.

● ఉత్తరప్రదేశ్‌లోని నమామి గంగానది సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ల్యాండ్‌ స్కేపింగ్‌ డిజైన్‌ చేసింది.

విద్యుత్‌ రంగంలోనూ..

● రువాండాలోని ఎగైజన్‌ జలవిద్యుత్‌ పవర్‌ ప్రాజెక్టు (బురుండి) డిజైన్‌

● రామగుండం మేడిపల్లి ఓపెన్‌కాస్టు తరహాలో నిర్మించే పంప్‌డ్‌ స్టోరేజీ విధానానికి గతంలోనే 600 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్‌ ఇంద్రావతి పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీగా సేవలు అందిస్తోంది.

● భూటాన్‌లోని మంగ్దేచు జలవిద్యుత్‌ ప్రాజెక్టుకు డిజైన్‌ సాంకేతిక సలహాదారుగా వ్యవహ రించింది.

● స్వచ్ఛభారత్‌ మిషన్‌, రివాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ కింద గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది.

మౌలిక సదుపాయాల రంగం..

● ఫిజీదేశంలో రెండు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సాంకేతిక సలహా సేవలు అందిస్తోంది.

● అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (అమృత్‌), స్మార్ట్‌ సిటీ మిషన్‌ పథకంలో భాగంగా నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్ల రూపకల్పన డిజైన్‌ చేసింది.

● మనదేశంలోని ఓడరేవులు, హార్బర్లు, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ అభివృద్ధికి డిజైన్‌, కన్సల్టెన్సీ సేవలు అందించింది.

● ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోంది.

ప్రాజెక్టు రూపకల్పనలో అనుసరించే విధానం..

● ప్రాజెక్టు ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం, హైడ్రాలిక్‌ డిజైన్‌, వ్యయ అంచనా, డ్రాయింగ్‌ తయారీ, భౌగోళిక, హైడ్రాలజీ అధ్యయనాలతో క్షేత్ర సర్వేలు, ప్రాజెక్టు రూపకల్పన నుంచి అమలు, నిర్వహణ వరకు సమగ్ర సేవలు అందించడం దీని ప్రధాన లక్ష్యం.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు..

వ్యాప్కోస్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలను అందిస్తోంది. ముఖ్యంగా అంగోలా, బంగ్లాదేశ్‌, భూటాన్‌, కంబోడియా, ఇథియోపియా, ఫిజీ, మంగోలియా, నేపాల్‌, రువాండా, శ్రీలంక, ఉగాండా, జింబాబ్వే తదితర 30 దేశాల్లో వ్యాప్కోస్‌ సేవలు అందించడం మనదేశానికి గర్వకారణమని అంటున్నారు.

దేశ, విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు

మినీరత్న హోదా సాధించిన ‘వ్యాప్కోస్‌’

డీపీఆర్‌ తయారీలో అగ్రగామి 1
1/2

డీపీఆర్‌ తయారీలో అగ్రగామి

డీపీఆర్‌ తయారీలో అగ్రగామి 2
2/2

డీపీఆర్‌ తయారీలో అగ్రగామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement