
అడగండి... అడుగేయండి
గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ముందు తల్లిదండ్రులు ఆచితూచీ అడుగేయాల్సిన అవసరం ఉంది. ఆ స్కూల్ ఎలాంటిది? గతంలో స్కూల్ విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫీజుల వివరాలు, తల్లిదండ్రులతో యాజమాన్యం ఎలా వ్యవహరిస్తుంది? అనే వివరాలు గమనించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దేది పాఠశాలే కాబట్టి.. ఆలోచించి అడుగేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. జిల్లాలో 120 గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. నేటి నుంచి పాఠశాలలు పునర్‌ప్రారంభం కానుండడంతో ఇప్పటికే జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. హంగు ఆర్భాటాలతో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉపాధ్యాయులను ఇళ్లకు పంపిస్తూ పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నారు.
అనుమతులు ఉన్నాయా..
ప్రైవేటు పాఠశాల తమ వివరాలను విద్యాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకొని ఉంటుంది. వారికి నిర్ధిష్ట సంఖ్య, నమోదైన సంవత్సరంతో కూడిన పత్రాన్ని ఇస్తారు. దీన్ని పరిశీలించాకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలి. కొన్ని పాఠశాలలు 1–7, 8–10 తరగతుల వరకు నిర్వహిస్తారు. ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది.
నోటీస్ బోర్డుపై ఇవి ఉన్నాయా..
మీరు చేర్పించబోయే ప్రైవేటు పాఠశాలలోని బోధన సిబ్బంది అర్హతలు ఎలా ఉన్నాయో గమనించాలి. అర్హత గల ఉపాధ్యాయులు ఉన్నారా? అనేది ఆరా తీయాలి. బీఈడీ, డీఈడీ వంటి విద్యార్హతలు గల వారితో విద్యాబోధన చేస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ఉపాధ్యాయుల వివరాలు, అర్హతలను ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగా ప్రైవేటు పాఠశాల నోటీస్ బోర్డుపై ప్రదర్శించారో.. లేదో చూడాలి. ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయి? ఫీజుల్లో పారదర్శకత ఉందా.. అడిగి తెలుసుకోవాలి.
వసతులపై దృష్టి పెట్టండి
మెరుగైన ఫలితాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో.. లేదో తెలుసుకోవాలి. ప్రాథమిక స్థాయి నుంచి పఠనాసక్తి కలిగించే ఎలాంటి అంశాలు అమలు చేస్తున్నారో అడగాలి. స్కూల్లో లైబ్రరీ, ప్లేగ్రౌండ్, టాయిలెట్స్.. తాగునీటి వసతుల గురించి తెలుసుకోవాలి.
ఇన్నోవేటీవ్ అంశాలపై..
పాఠశాలలో ఇన్నోవేటివ్ అంశాలు నేర్పిస్తున్నారా.. కొత్త విషయాలను విద్యార్థులకు తెలిసేలా తరగతులు నిర్వహిస్తున్నారా.. తెలుసుకోవాలి. గతంలో వైజ్ఞానిక ప్రదర్శనలు.. ఇన్స్పైర్ మానక్, సైన్స్మేళాల్లో భాగస్వామ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని, ప్రతిభ చాటే వారిని ఎలా ప్రోత్సాహం ఎలా ఉందో ఆరా తీయాలి. అలాంటి పాఠశాలలను తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి.