అమ్మ మాట.. అంగన్‌వాడీ బాటపై ప్రత్యేక శ్రద్ధ
● 17 వరకు ఇంటింటి ప్రచారం
సుల్తానాబాద్(పెద్దపల్లి): రామగుండం, పెద్దపల్లి, మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో సుమారు 706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో గర్భిణులు 3,471 మంది, ఆర్నెల్ల వయసుగల చిన్నారులు 2,414 మంది, మూడేళ్ల వయసుగలవారు 17,340 మంది, ఆరేళ్ల వయసుగలవారు 15,834 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. గురువారం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట పేరిట ఇంటింటా పర్యటించేందుకు అంగన్‌వాడీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నా రు. మూడేళ్ల వయసుగల చిన్నారులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా ఐదేళ్ల వయసు పైబడిన పిల్లలను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నా రు. వీటితోపాటు ఈనెల 17వ తేదీ వరకు అంగన్‌వాడీ ప్రాంగణాల్లో కిచెన్ గార్డెన్లు అభివృద్ధి చే యాలి. కూరగాయల మొక్కలు పెంచాలి. హాట్‌కుక్ డ్ మీల్స్ ద్వారా పోషకాహారం అందించాలి. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయాలి. ఆటాపాటలు, బొమ్మల ద్వారా చదువు చెబుతున్నామని ప్రచారం చేయాలి.
ఆటాపాటలతో చదువు
ప్రభుత్వం ఈసారి అమ్మ మాట.. అంగన్‌వాడీ బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఈమేరకు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు అంగన్‌వాడీ టీచర్లు వివిధ కార్యక్రమాలు చేపడతారు. బొమ్మలు, వస్తువులతో ఆటాపాటల ద్వారా చిన్నారులకు చదువు చెబుతారు.
– వేణుగోపాల్, డీడబ్ల్యూవో, పెద్దపల్లి


