
మధు.. స్థాయి దిగజార్చుకోవద్దు
పెద్దపల్లిరూరల్: ‘ఎమ్మెల్యేగా.. జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్‌గా సేవలు అందించినవ్.. ఇప్పుడు అధికారం పోయిందన్న బాధతో అడ్డగోలు విమర్శలు చేసి నీ స్థాయి దిగజార్చుకోవద్దు’ అని డీసీసీ అధ్యక్షుడు ఠాకూర్ మక్కాన్‌సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో దగాపడ్డదే దళితులు అనే సంగతిని ప్రజలు గుర్తుంచుకున్నారని, ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతూ మాట్లాడడం బురద చల్లే ప్రయత్నమేనన్నారు. తెలంగాణకు తొలి సీఎంగా దళితుడేనని ప్రకటించి మోసం చేసింది మొదలు.. అనేక హామీలు ఇచ్చి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వంశీకృష్ణను తాము గెలి పించుకుంటే తమ పార్టీ అంతర్గత వ్యవహరంలో నీ జోక్యం ఎందుకుని వారు ప్రశ్నించారు.
ఘనంగా పుష్కర ఏర్పాట్లు
మంథని సెగ్మెంట్ పరిధిలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తుంటే ఓర్వలేక పుట్ట మధు నిందారోపణలకు దిగుతున్నారని ఠాకూర్, విజయరమణరావు అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారందరికీ ఆహ్వానాలు అందిస్తారని, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు కూడా సమాచారం ఉందని అన్నారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మంత్రిశ్రీధర్‌బాబు సతీమణి శైలజారామయ్యర్‌పై పుట్ట మధు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు ఈర్ల స్వరూప, ప్రకాశ్‌రావు, నాయకులు బండారి రామ్మూర్తి, అవినాష్, మల్లయ్య, సుభాష్‌రావు, సంపత్, శ్రీనివాస్, మస్రత్ పాల్గొన్నారు.
దళితులపై మొసలికన్నీరు కార్చితే ఎవరూ నమ్మరు
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో దగా పడ్డదే దళితులు
డీసీసీ అధ్యక్షుడు మక్కాన్‌సింగ్, ఎమ్మెల్యే విజయరమణారావు