
పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: పంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘పారిశుధ్య కార్మికుల భద్రత.. రక్షణ.. గౌరవం’ అంశంపై కలెక్టరేట్‌లో బుధవారం ఎంపీడీవోలకు శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. పల్లెప్రజల ఆరోగ్యం కోసం వీధులను పరిశుభ్రంగా ఉంచేలా శ్రమిస్తున్న కార్మికులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పంచాయతీ నిధుల నుంచి ప్రతీ కార్మికుడికి ప్రమాద బీమా ప్రీమియం చెల్లించాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను డిసెంబర్ వరకు నియంత్రించేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులను కలెక్టర్ సన్మానించారు. యూనిసెప్ ట్రెయినర్ కిషన్‌స్వామి, ఫణీంద్ర, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో కాళిందిని, జెడ్పీ సీఈవో నరేందర్, స్వచ్చభారత్ మేనేజర్ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి కాలువలకు మరమ్మతు చేయాలి
సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేసే కాలువలకు మరమ్మతు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇందుకోసం ఉపాధిహామీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రాజీవ్ యువ వికాసం కింద అర్హులైన వారిని ఎంపిక చేయాలని అన్నారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి తదితరులు ఉన్నారు.