
ఓసీపీ–1.. సింగరేణిలో నంబర్–1
గోదావరిఖని: అత్యుత్తమ పనితీరు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ప్రమాదాల నియంత్రణ.. పర్యావరణ పరిరక్షణ.. వెరసి రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించింది సింగరేణి ఓసీపీ–1 గని. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. అన్నింటా అగ్రగామిగా నిలిచి రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఈమేరకు కోల్‌మినిస్ట్రీ నుంచి బుధవారం సమాచారం అందింది.
స్వీయ మూల్యాకనం..
బొగ్గు, లిగ్నైట్ గనుల పనితీరును స్వీయ మూల్యాంకనం చేయడం, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ద్వారా స్టార్ రేటింగ్ విధానం 2019 ఏప్రిల్ 1 నుంచి కొనసాగుతోంది. అత్యుత్తమ విధివిధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఉత్తమ రక్షణ తీరు అవలంబిస్తున్న ఓసీపీ–1కు కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తోంది. ప్రాజెక్టు ఆర్ధిక పనితీరు, ఉద్యోగి సంక్షేమం, రక్షణ, ఉద్యోగ భద్రత వంటి ప్రమాణాల్లో ప్రాజెక్టు రెండోసారి ఉత్తమ పనితీరు కనబరిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కోల్‌కంట్రోలర్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్, కోల్‌మినిస్ట్రీ కార్యాలయం ప్రకటించిన జాబితాలో ప్రాజెక్టుకు చోటు లభించింది. సింగరేణిలోని అన్ని గనులు, ఓసీపీల్లో ఓసీపీ–వన్ 92పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది కూడా 91పాయింట్లు సాధించి ఫైవ్‌స్టార్ రేటింగ్ పొందింది. త్వరలో కేంద్ర బొగ్గుగనుల శాఖ ద్వారా ఈ అవార్డు అందుకోనుంది. ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధనలో కృషి చేసిన ఓసీపీ–1 ఉద్యోగులు, అధికారులను ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావు అభినందించారు.
పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానంలో భేష్
ఉపరితల గనికి వరుసగా రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్
ఇదేస్ఫూర్తి ప్రదర్శించాలి
సింగరేణిలోనే అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రెండోసారి ఫైవ్‌స్టార్ రేటింగ్ రావడం సంతోషంగా ఉంది. సమష్టి కృషి ఫలితంగానే బహుమతి అందుకోబోతున్నాం. భవిష్యత్‌లోనూ ఇదేస్ఫూర్తితో ముందుకు సాగాలి. కంపెనీకి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో ప్రతీఒక్కరు కృషి చేయాలి.
– రాజశేఖర్, ప్రాజెక్టు అధికారి

ఓసీపీ–1.. సింగరేణిలో నంబర్–1

ఓసీపీ–1.. సింగరేణిలో నంబర్–1