
మావోయిస్టు పార్టీతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
కరీంనగర్‌క్రైం: మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిల్మ్ భవన్‌లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ మహాసభలు అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల విధ్వంసానికి, ఇటుక బట్టీలలో ఒరిస్సా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉమ్మడి పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ పోరాటాలు నిర్వహించిందన్నారు. సంఘం నాయకులు కామ్రేడ్ గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, అజాం ఆలీ, డాక్టర్ రామనాథం, నర్రా ప్రభాకర్ అక్రమ హత్యలు మొదలు జగిత్యాల జిల్లా రేచపల్లికి చెందిన పోగుల రాజేశంను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అతడి కూతురును అల్లుడు హత్య చేస్తే కూతురు చివరి చూపునకు నోచుకోకుండా హింసించిందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ, కగార్ పేరుతో ఆదివాసీలను, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని, ఛత్తీస్‌గఢ్‌లో సైనిక క్యాంపులను ఎత్తివేయాలని తదితర అంవాలపై తీర్మాణాలు చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌చందర్, ప్రధాన కార్యదర్శి పాణి, ముడిమడుగుల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంకూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా పుల్ల సుచరిత, నారా వినోద్, కార్యదర్శిగా బొడ్డుపల్లి రవి, సహాయ కార్యదర్శులుగా గడ్డం సంజీవ్, రెడ్డిరాజుల సంపత్, కోశాధికారిగా మాదవనేని పర్వతాలును ఎన్నుకున్నారు.
పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క నారాయణరావు