
ఆధునిక నర్సింగ్ మార్గదర్శకురాలు నైటింగేల్
జ్యోతినగర్(రామగుండం): ఆధునిక నర్సింగ్ మార్గదర్శకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ అని ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నైటింగేల్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సులు ఏ ఆసుపత్రికై నా వెన్నెముక అని, వైద్యులు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు రోగిని పరిశీలిస్తారని, కానీ నర్సులు రోగి చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు శ్రద్ధ తీసుకుంటారని వారి సేవలను కొనియాడారు. అనంతరం నర్సులను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత, ఎన్టీపీసీ ప్రాజెక్టు ఉన్నతాధికారులు, ఆస్పత్రి డాక్టర్లు, నర్సులు పాల్గొన్నారు.