
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన బార్ అసోసియేషన్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం జ్యోతిభవన్‌లో బస చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్‌పాల్‌ను ఆదివారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శారదానగర్‌లో నిర్మిస్తున్న నూతన కోర్టు భవనాలకు నిధులు కేటాయించి త్వరగా పూర్తయ్యేలా చొరవచూపాలని విన్నవించారు. చీఫ్ జస్టిస్ సానుకూలంగా స్పందించారు. చీఫ్ జస్టిస్‌ను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, జాయింట్ సెక్రటరీ ముచ్చకుర్తి కుమార్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ ప్రేరేపిత సమ్మెను వ్యతిరేకించాలి
గోదావరిఖని(రామగుండం): సింగరేణి కార్మికులు ఈనెల 20న జరిగే రాజకీయ ప్రేరేపిత సమ్మెను వ్యతిరేకించాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో మాట్లాడారు. కార్మిక సంఘాలు రాజకీయ ఎజెండాను అమలు చేసేందుకు, తమ ఉనికి చాటుకోవడానికి సమ్మెకు పిలుపునిచ్చాయని, దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రజలకు, ప్రభుత్వాలకు, రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాల్సిన రాజకీయ పార్టీలు సమ్మె చేయడం సరికాదన్నారు. కార్మికుల సంక్షేమం, రక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనం లేని సమ్మెలో పాల్గొని నష్టపోవద్దన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభ సమయంలో సమ్మెకు పిలుపునివ్వడం దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందన్నారు. సమావేశంలో నాయకులు సారంగాపాణి, కర్రావుల మహేశ్, ఆకుల హరిణ్, సాయవేణి సతీశ్, మేడ రామ్మూర్తి, పెంచాల వెంకటస్వామి, తుమ్మ గట్టయ్య, పుప్పాల నాగేంద్రప్రసాద్, సల్ల వేణు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీ
ఓదెల(పెద్దపల్లి): కాజీపేట్– బల్లార్షా సెక్షన్ల మధ్యలోని కొలనూర్, ఓదెల, పొత్కపల్లి రైల్వేస్టేషన్‌లలో ఆదివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రామగుండం సీసీ అంబర్‌కిషోర్ జా, డీసీసీ కరుణాకర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పొత్కపల్లి ఎస్సై రమేశ్, బాంబ్ డిస్పోజల్ టీం, డాగ్‌స్క్వాడ్ బృందాలతో ప్రయాణికుల లగేజీ బ్యాగులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, రైల్వేస్టేషన్‌లో, రోడ్లపైనా అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం అందించాలని, ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన బార్ అసోసియేషన్

హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన బార్ అసోసియేషన్