
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
పెద్దపల్లిరూరల్/సుల్తనాబాద్/ధర్మారం/పాలకుర్తి: గాలివాన అన్నదాతను అతలాకుతలం చేసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం కష్టం నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శనివారం జిల్లా కేంద్రం పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్, ధర్మారం, పాలకుర్తి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పెద్దపల్లి పట్టణంతో పాటు మండలంలోని రాఘవాపూర్, రంగాపూర్, సబ్బితం తదితరగ్రామాల్లో అక్కడక్కడ రాళ్లవాన కురిసింది. పట్టణంలో రోడ్లపక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో చెట్లకింద నిలిపి ఉంచిన కారుపై చెట్టు విరిగిపడింది. పట్టణమంతా చిమ్మచీకట్లు అలుముకున్నాయి. విద్యుత్ అధికారులు, సిబ్బంది శ్రమించి సరఫరా పునరుద్ధరించారు. సుల్తానాబాద్, శాస్త్రినగర్, పూసల సుగ్లాలంపల్లి, పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్, కొత్తపల్లి, పాలకుర్తి, కురుమపల్లి తదితర ప్రాంతాల్లో వర్షంతో అన్నదాత ఇబ్బందిపడ్డారు.
కేంద్రాల్లో ధాన్యం.. అన్నదాత దైన్యం
ధాన్యం అమ్ముకుందామని తెచ్చిన ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయకపోవడంతో రోజుల తరబడి కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పల వద్దే నిరీక్షించాల్సివస్తోందని వాపోయారు. శనివారం అకస్మాతుగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లితో పాటు సుల్తానాబాద్ మండలాల్లో 17.0 మి.మీ, ధర్మారం, పాలకుర్తిలో 3.0 మి.మీ వర్షపాతం కురిసిందని అధికారులు తెలిపారు.
రైతన్న క‘న్నీరు’
భారీగా వీచిన గాలులు
కూలిన చెట్లు, తెగిన కరెంట్ తీగలు
జిల్లాలో పలుచోట్ల చిమ్మచీకట్లు
పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, పాలకుర్తిలో తడిసిన ధాన్యం

అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం

అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం