
మెరుగైన సేవలకు వందరోజుల కార్యాచరణ
● అధికారులూ.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి ● రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ ఆదేశం
కోల్‌సిటీ(రామగుండం): పారిశుధ్య నిర్వహణతోపాటు మిగతా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు వందరోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. బల్దియా కార్యాలయంలో వార్డు అధికారులు, రెవెన్యూ, పారిశుధ్య, ఇంజినీరింగ్ సిబ్బందితో శుక్రవారం వివిధ అంశాలపై కమిషనర్ సమీక్షించారు. వచ్చే వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధులు ప్రబలకుండా నాలాల్లో పూడిక తొలగించాలన్నారు. ఇంటింటా చెత్తసేకరణ, తరలింపు, దోమల నియంత్రణపై దృష్టి సారించాలని అన్నారు. ఇందులో ఉత్తమ సేవలు అందించిన పారిశుధ్య సిబ్బందికి ప్రతీనెల నగదు అవార్డు ఇవ్వాలని స్పెషలాఫీసర్ ఆదేశించారని వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తమ సేవలు అందించిన కొందరిని గుర్తించి, రూ.2,000 నగదు బహుమతి అందజేస్తున్నామని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి ముందే సమస్యను వార్డు అధికారులు గుర్తించి పరిష్కరించాలని అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డుల అర్హుల జాబితాను వెంటనే సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు. ఎర్లీబర్డ్ ఆఫర్ 5శాతం రాయితీతో ఆస్తిపన్ను వసూళ్లలో రామగుండం బల్దియా ముందంజలో ఉండడానికి వార్డు అధికారులు, సహాయకులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి కారణమంటూ అభినందించారు. ఉత్తమ సేవలు అందించిన వారికి జ్ఞాపికలు అందజేసి ప్రశంసించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, డీఈఈ హన్మంతరావు నాయక్, ఆర్‌వో ఆంజనేయులు, ఆర్‌ఐలు శంకర్‌రావు, ఖాజా, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కిరణ్, కుమారస్వామి పాల్గొన్నారు.