
ప్రాణం మీదికి తెచ్చిన మామిడికాయ వక్క
● ఊపిరాడక తల్లడిల్లిన బాలుడు
పాలకుర్తి(రామగుండం): మామిడికాయ వక్క గొంతులో ఇరుక్కుని బాలుడు ఊపిరాడక నరకయాతన అనుభవించిన ఘటన శనివారం పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామంలో జరిగింది. 108 సిబ్బంది కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ పదినెలల వయసు ఉన్న బాలుడు ఇంట్లో మామిడివక్క మింగాడు. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడలేదు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు బైక్‌పై పెద్దపల్లికి తరలిస్తూ కన్నాల గ్రామానికి చేరుకున్నారు. అప్పుడే ఎదురుగా 108 వాహనం రావడంతో అందులో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. ఎయిర్‌వేను కొంతమేర క్లియర్ చేస్తూ పెద్దపల్లికి చేరుకున్నారు. పెద్దపల్లిలో పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందంటూ కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో మరో అంబులెన్స్ ద్వారా కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ విషయమై సోషల్‌మీడియాలో విభిన్న కథనాలు వైరల్ అయ్యాయి.
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సైదాపూర్(హుస్నాబాద్): నాలుగేళ్ల ప్రాయంలో ఊహ తెలియక ముందే తల్లిదండ్రులను కోల్పోయాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. నా అనే వారు ఎవరూ లేరు. ఒంటరి తనం, అనారోగ్యం భరించలేక ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు.. సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన అనగోని సంపత్–సుజాత దంపతుల కుమారుడు వికాస్(27). నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి తాత, నాన్నమ్మ లక్ష్మయ్య, లక్ష్మి వద్ద పెరిగాడు. హుస్నాబాద్‌లోని ఓ షాపులో పని చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 10 నెలల క్రితం తాత, 6 నెలల క్రితం నానమ్మ మృతిచెందారు. ఒంటరితనం, అనారోగ్యంతో ఐదురోజుల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.