
హైదరాబాద్‌కు సాఫీగా తాగునీటి సరఫరా
రామగుండం: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇదేసమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పడిపోతోంది. అయినా, హైదరాబాద్ మహానగరానికి అవసరమైన నీటి సరఫరాకు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధి కారులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ప్రా జెక్టులో ఇప్పుడు రెండు టీఎంసీల నీటి నిల్వలు అదనంగా ఉండడమే ఇందుకు కారణం.
ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148.00 మీటర్లుకాగా, నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 142.71 మీటర్లు ఉందని, 8.50 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదేరోజు నీటిమట్టం 141.23 మీటర్లు, ఉండగా నీటి నిల్వలు 6.38 టీఎంసీలు ఉన్నాయని వారు గుర్తుచేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 134 మీటర్లకు పడిపోతే డెడ్ స్టోరేజీగా భావిస్తారని అధికారులు తెలిపారు. ఆ దశలో ప్రా జెక్టులో 0.690 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.
మరోనాలుగు మీటర్లు తగ్గితే ఎత్తిపోతలు..
ప్రాజెక్టులో మరో ఆరు మీటర్ల నీటిమట్టం తగ్గితే నే హైదరాబాద్ మహానగరానికి ప్రతీరోజు 6.6 కేవీ సామర్ధ్యం గల ఆరు విద్యుత్ మోటార్ల సా యంతో 56 క్యూసెక్కులు(0.03 టీఎంసీ) నీటిని పంపింగ్ చేస్తారు. ఈలెక్కన ప్రాజెక్టు నీటిమట్టం 138.3 మీటర్లకు పడిపోతే హెచ్‌ఎండబ్ల్యూఎస్‌లో మోటార్లతో పంపింగ్ చేసేందుకు సాధ్యం కాదు. ప్రస్తుతం నాలుగు టీఎంసీల వ్యత్యాసం ఉండడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. రెండు టీఎంసీల నీటినిల్వలు తగ్గేందుకు కనీసం నెలరోజులు పడుతుందని, ఆలోగా వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.