
తూకం.. ఆలస్యం
● లారీ లోడ్‌కు సరిపడా వస్తేనే సేకరణ ● సన్నరకాల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ● బహిరంగ మార్కెట్‌లో మంచిడిమాండ్ ● కేంద్రాల్లో రైతులకు తప్పని పడిగాపులు
సాక్షి, పెద్దపల్లి: సన్నరకం వడ్లకు బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా రైతుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉండడంతో అటువైపే మొగ్గుచూపుతూ, కొనుగోలు కేంద్రాలకు దొడ్డువడ్లు తీసుకొస్తున్నారు. కొన్ని సెంటర్లకు తెచ్చి న సన్నవడ్లను తేమశాతం పేరిట కొనుగోలు చేయడం లేదు. లారీలోడ్‌కు సరిపడా వస్తేనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో సన్నవడ్లు తీసుకొస్తున్న కొందరు రైతులు తూకం కోసం ఎదురుచూస్తున్నారు. అకాలవర్షాల భయంతో కొందరు బహిరంగ మార్కెట్‌లోనే సన్నవడ్లు విక్రయిస్తున్నారు.
సన్నాల్లో 33 రకాలు..
సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తోంది. దొడ్డు రకంలో గ్రేడ్–ఏ క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లిస్తోంది. 33 సన్న రకాలను గుర్తించిన ప్రభుత్వం.. ఆ రకాలకు బోనస్‌తో కలుపుకొని రూ.2,820 ధర చెల్లిస్తోంది.
లారీ లోడ్ కాక.. మిల్లులకు అలాట్ చేయక
ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాల్‌పై రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఈసారి యాసంగిలో రైతులు ఎక్కువగా దొడ్డురకం సాగుచేశారు. సన్నరకాలను తక్కువగా సాగు చేయడమేకాదు.. కొనుగోలు కేంద్రాలకు కూడా సరిగా తేవడం లేదు. కొందరే తీసుకొస్తున్నా.. సన్నవడ్లను దొడ్డు రకంతో కలిపి రైస్‌మిల్లులకు తరలించే వీలు ఉండదు. సన్నాల తరలింపు కోసం ప్రత్యేకంగా లారీని కొనుగోలు కేంద్రానికి పంపించాల్సి ఉంది. అయితే, తక్కువగా సన్నవడ్లు రావడంతో నిర్వాహకులు సకాలంలో తూకం వేయడంలేదు. లారీ లోడ్‌కు సరిపడా వస్తేనే కొనుగోలు చేస్తామంటున్నారు. అంతేకాదు.. సన్నవడ్లకు రైస్‌మిల్లులు కేటాయించలేదు. దీనితోనూ కొనుగోళ్లలో ఆలస్యమవుతోంది. మరోపక్క సన్నాలకు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉంది. క్వింటాల్ బియ్యానికి రూ.5వేల నుంచి రూ.6వేల వరకు ధర పలుకుతోంది. అందుకే వడ్లు మరాడించి విక్రయించాలని సన్నాలు పండించిన రైతులు ఆలోచిస్తున్నారు. దీంతోపాటు రైతులు తమతిండి కోసం సన్నాలే వినియోగిస్తున్నారు. కొన్నిసెంటర్లకు సన్నాలు వచ్చినా తేమశాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోలు చేయడం లేదు. ఇదేవిషయమై పౌర సరఫరాల డీఎం శ్రీకాంత్‌ను సంప్రదించగా.. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ప్రతీధాన్యపు గింజను కోనుగోలు చేస్తామన్నారు. సన్నవడ్లను రైస్ మిల్లులకు అలాట్ చేశామని, కొనుగోళ్లను వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు.
జిల్లాలో ధాన్యం వివరాలు
కొనుగోలు కేంద్రాలు 333
ప్రారంభించినవి 315
ధాన్యం సేకరణ లక్ష్యం(లక్షల మెట్రిక్ టన్నుల్లో) 3.50
కొనుగోలు చేసిన దొడ్డువడ్లు(మెట్రిక్ టన్నుల్లో) 81,308
కొనుగోలు చేసిన సన్నరకం వడ్లు(మెట్రిక్ టన్నుల్లో) 828
మిల్లులకు తరలించిన వడ్లు(మెట్రిక్ టన్నుల్లో) 81,799
యాసంగి సాగు విస్తీర్ణం 2.08 లక్షల ఎకరాలు..
జిల్లాలో యాసంగిలో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందులో సన్నరకం 78,390 ఎకరాల్లో పండించారు. మొత్తంగా 4.20 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని, ఇందులో 50వేల టన్నుల సన్నరకం, 3 లక్షల టన్నుల దొడ్డురకం ఉంటుందని అంచనా వేశారు. రైతుల తిండికి, బయటి మార్కెట్‌లో విక్రయించగా పోను మిగిలిన సుమారు 3.50 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. కానీ, వరి కోతలు దాదాపు చివరిదశకు చేరినా సన్నరకం వడ్లు ఆశించిన స్థాయిలో కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు.

తూకం.. ఆలస్యం