
ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● రాజీవ్ రహదారి వెంట సర్వీస్ రోడ్లు ● రూ.25 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారీ
గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ల వి స్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు అవరోధంగా మారిన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ భవనం, 20 దుకాణాలను ఇటీవల తొలగించిన అధికారులు.. మిగతాచోట్ల పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.
రామగుండం నుంచి గంగానగర్ వరకు..
రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరంగా మారింది. నిత్యం ఏదోఓచోట ప్ర మాదం జరుగుతూనే ఉంది. ఇప్పటిరకు ఇలా జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో వాహనదారు లు, పాదచారులు, ప్రయాణికులు మృతిచెందారు. అనేకమంది గాయాలపాలయ్యారు. భారీ వాహనా లు అతివేగంగా వెళ్లడం, అదేసమయంలో రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండడంతో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆ ర్‌ఎఫ్‌సీఎల్ పరిశ్రమలు విస్తరించాయి. దీంతో రో డ్లు నిత్యం బిజీగా మారాయి. పెరుగుత్ను జనాలు, వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్‌కేఆర్ సంస్థ రోడ్లు విస్తరించడం లేదని, తద్వారా ప్రమాదాల సంఖ్య పెరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.
బీగెస్ట్ హౌస్ మూలమలుపు వద్ద సర్కిల్..
సింగరేణి బీ – గెస్ట్‌హౌస్ మూలమలుపు వద్ద రాజీ వ్ రహదారిపై తరచూ చోటుచేసుకునే ప్రమాదాలను నియంత్రించేందుకు సర్కిల్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక్కడ రోడ్డు విస్తరిస్తే.. మంచిర్యాల వైపు వెళ్లే, మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఉండదని అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు.
రాజీవ్ హైవేపై బ్లాక్ స్పాట్లు..
రాజీవ్ హైవేపై బీ– పవర్‌హౌస్ గడ్డ నుంచి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు ప్రమాదాలు అధికంగా జరు గుతున్నాయి. దీంతో పోలీసుశాఖ రంగంలోకి దిగింది. ఎన్టీపీసీ లేబర్‌గేట్, ఆర్‌ఎఫ్‌సీఎల్ క్రాసింగ్, మున్సిపల్ తీన్‌రస్తా, బస్టాండ్, జీఎం ఆఫీస్ మూలమలుపు, మిలీనియం క్వార్టర్స్ రోడ్డు క్రాసింగ్, గంగానగర్ ఫ్లైఓవర్ వరకు బ్లాక్‌స్పాట్లు గుర్తించింది.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక..
ఎన్టీపీసీ లేబర్‌గేట్ వద్ద కార్మికులు రాజీవ్ రహదారి దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని మరణిస్తున్నారు. చాలామంది గాయాలపాలవుతున్నారు. ప్రమాదాలను నియంత్రణకు ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. మేడిపల్లి చౌరస్తా కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది.
ఫుట్‌బ్రిడ్జి కోసం రూ.5 కోట్లు..
మున్సిపల్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు ఆర్ అండ్ బీ మంత్రిని ఎమ్మెల్యే కలిశారు. మెడికల్ కాలేజీ నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు నేరుగా వెళ్లేందుకు రాజీవ్ హైవేపై ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విన్నవించగా, రూ.5 కోట్లు మంజూరయ్యాయి. దీంతో మెడికల్, పీజీ, డిగ్రీ కళాశాలలకు వెళ్లివచ్చే వారికి సౌకర్యంగా ఉంటుంది.
అసంపూర్తిగా సర్వీస్‌రోడ్లు
కవిత థియేటర్ నుంచి ఇల్లెందు గెస్ట్‌హౌస్ వరకు సర్వీస్ రోడ్డు ఇంకా పూర్తికాలేదు. సాయిలీలా హోటల్ నుంచి పోలీసు కమిషనరేట్, ఎస్‌బీఐ నుంచి మేడిపల్లి సెంటర్ వరకు, బీ – పవర్‌హౌస్ గడ్డ నుంచి కుడివైపు సర్వీస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది.
సర్వీస్ రోడ్ల పరిశీలన
రాజీవ్ హైవే వెంట సర్వీస్ రోడ్ల విస్తరణపై రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, హెచ్‌కేఆర్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ఇంజినీర్లు, నిపుణులు సోమ వారం పరిశీలన చేశారు. సర్వీస్ రోడ్ల విస్తరణకు సుమారు రూ.25కోట్లతో అంచనాలు ప్రతిపాదించారు. నగర రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జీఎం ఆఫీస్ మూలమలుపు వద్ద ప్రమాదాల నియంత్రణకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.