● జోరుగా మట్టిదందా
● కొరవడిన అధికారుల పర్యవేక్షణ
● ఒకే వే బిల్లుపై మూడునాలుగు ట్రిప్పులు
● ప్రభుత్వ ఆదాయానికి గండి
పాలకుర్తి(రామగుండం): పాలకుర్తి మండల పరిధిలోని కన్నాల ఉర్సుగుట్ట, బోడగుట్ట కేంద్రాలుగా మట్టిదందా జోరుగా సాగుతోంది. ఉమ్మడి కన్నాల పరిధిలో అధికారపార్టీకి చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు గ్రూపులుగా ఏర్ప డి మట్టిదందా నిర్వహిస్తున్నారు. కన్నాల రెవెన్యూ శివారులోని 399, 372, 493 సర్వేనంబర్లలో మట్టిని తరలించేందుకు ప్రైవేటు కాంట్రాక్ట్ సంస్థల పేరిట అనుమతులు పొంది బహిరంగ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మట్టికి మంచి డిమాండ్ ఉండటంతో దందా నిరాటంకంగా కొనసాగుతోంది.
అనుమతుల వరకే అధికారులు..
మట్టి సరఫరా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల్లో పలుకుబడి కలిగిన వారికి అనుమతులు మంజూరు చేస్తున్న మైనింగ్, రెవెన్యూశాఖల అధికారులు.. అనుమతుల అనంతరం వాటి పర్యవేక్షణ విస్మరిస్తున్నారు. కనీసం ఎంత మొత్తంలో మట్టి తరలిస్తున్నారు, కేటాయించిన సర్వే నంబర్‌లలో మాత్రమే తవ్వకాలు జరుపుతున్నారా అనే విషయాలపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఈ దందా నిర్వాహకులకు ఆడింది ఆట, పాడింది పాటగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యవైఖరితో విలువైన ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. గుట్టలతో పాటు లువైన వృక్ష సంపద ధ్వంసం అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా ఇసుక, మట్టి, మైనింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు ఎప్పటికప్పడు ఆదేశాలు జారీ చేస్తున్నా స్థానికంగా మాత్రం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విశేషం.
ఒక వే బిల్లు.. మూడునాలుగు ట్రిప్పులు..
● ప్రస్తుతం మార్కెట్‌లో మట్టికి బాగా డిమాండ్ ఉంది. నూతన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారుల నిర్మాణానికి మట్టి అవసరం.
● దీంతో కన్నాల సమీపంలోని గ్రామాలతో పాటు పెద్దపల్లి, గోదావరిఖని, ఎన్టీపీసీ తదితర పట్టణ ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రిప్పునకు రూ.5 వేల నుంచి 6వేల వరకు వసూలు చేస్తున్నారు.
● మైనింగ్‌శాఖకు ఒక్కో క్యూబిక్ మీటర్‌కు రూ.44 చెల్లించాలి. ఈ లెక్కన ఒక్కో లారీకి రూ.800 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
● అయితే సదరు నిర్వాహకులు ఒకే వే బిల్లుపై మూడునాలుగు ట్రిప్పులు తరలిస్తున్నారు. కన్నాల శివారు నుంచి గోదావరిఖనికి దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
● కానీ వేబిల్లుపై మాత్రం దూరం 50కిలోమీటర్లుగా, చేరుకునేందుకు కావాల్సిన సమయం 4.30 గంటలుగా ఉంటోంది.
● సాధారణంగా లారీ 25కిలోమీటర్ల దూరాన్ని 20 నుంచి 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈలెక్కన 4.30 గంటల వ్యవధిలో మూడు నుంచి నాలుగు ట్రిప్పుల మట్టిని తరలించే అవకాశాలు ఉన్నాయి.
● రోజుకు దాదాపు 200 పైగా లారీ ట్రిప్పుల మట్టిని తరలిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
● కాగా ఈ విషయమై పాలకుర్తి మండల తహసీల్దార్ జ్యోతిని వివరణ కోరగా.. మండల పరిధిలోని కన్నాల శివారులో ఇద్దరికి, జయ్యారం శివారులో ఒకరికి ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించేందుకు ఎన్‌ఓసీ జారీ చేశామని తెలిపారు. అయితే వే బిల్లుల అంశం మైనింగ్‌శాఖ పరిధిలో ఉంటుందని, అలాగే ఒక సంస్థ పేరుమీద అనుమతులు పొంది ఇతర ప్రాంతాలకు మట్టిని తరలించే విషయం కూడా సంబంధిత శాఖనే పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు.
కనుమరుగవుతున్న ప్రకృతి సంపద
అధికారులు విచ్చలవిడిగా మంజూరు చేస్తున్న అనుమతులతో ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. ఇప్పటికే కన్నాల బోడగుట్టపై విచ్చలవిడిగా మైనింగ్ కొనసాగుతుంది. దీనికి తోడు ప్రస్తుతం మటి్‌ట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో భవిష్యత్‌లో గుట్ట కనుమరుగుకానుంది. మరోవైపు కన్నాల ఉర్సు గుట్టపై దర్గా ఉంది. ఏటా స్థానిక ముస్లింలు ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం అదే గుట్టకు అధికారులు మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంతో కొంతమంది ముస్లింలు మొదట్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, నిర్వాహకులు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో తమ పలుకుబడిని ఉపయోగించి వారిని అడ్డుకున్నారని, ఈనేపథ్యంలో వారు సంబంధిత విషయమై కోర్టుకు వెళ్లినట్లు సమాచారం.
గుట్టలు గుల్ల..
గుట్టలు గుల్ల..