ఎమ్మెల్సీ గెలుపులో ‘బండి’ మార్క్‌ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ గెలుపులో ‘బండి’ మార్క్‌

Mar 5 2025 1:14 AM | Updated on Mar 5 2025 1:09 AM

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: కరీంనగర్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌–మెదక్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మల్క కొమురయ్య గెలుపు రాజకీయ, ఉపాధ్యాయవర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి బీజేపీ అనుబంధ సంఘమైన తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(తపస్‌) రాష్ట్రంలో ఇతర యూనియన్లతో పోలిస్తే బలమైన ఉపాధ్యాయ సంఘం కాదు. పీఆర్టీయూ, యూటీఎఫ్‌, ఎస్టీయూ వంటివి బలమైన ఉపాధ్యాయ సంఘాలుగా ప్రసిద్ధి చెందాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా సంఘాల అభ్యర్థులే గెలవడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. అందుకే, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వంటి బలమైన పార్టీలు కూడా పోటీకి దూరంగా ఉంటూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని నిలిపి, గెలిపించడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలకంగా వ్యవహరించారు. ఆయన మార్క్‌ ప్రచారం, రాజకీయ ఎత్తుగడలు పనిచేసినట్లుగా పార్టీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బలమైన ఉపాధ్యాయ సంఘాలను, ఇటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు మద్దతిచ్చిన అభ్యర్థిని ఢీకొట్టి కొమురయ్యను గెలిపించడంలో బండి మరోసారి సక్సెస్‌ అయ్యారని మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బైకు ర్యాలీలతో సంబరాలు జరుపుకున్నారు.

ప్రభారీ మీటింగ్‌లతో..

ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నాటి నుంచి సంజయ్‌ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారం కొనసాగించారు. ముఖ్యంగా 25 మంది ఓటర్లకు ఒక ప్రభారీ (ఇన్‌చార్జి)ని నియమించడం ప్రభావవంతంగా పనిచేసిందని పార్టీవర్గాలు అంటున్నాయి. వీటితోపాటు జిల్లాలు, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పచ్చీస్‌ ప్రభారీల సమావేశం నిర్వహించడం, ఆ సమావేశాలకు స్వయంగా తానే వెళ్లి వారికి మార్గదర్శనం చేశారు. దేశవ్యాప్తంగా మోదీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని, ఉద్యోగులకు రూ.12 లక్షల దాకా ఐటీ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పదేపదే టీచర్లలోకి తీసుకెళ్లాలని గుర్తుచేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలకుల తీరుతో తెలంగాణలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతీ సమావేశంలోను వివరిస్తూ టీచర్ల పక్షాన చేసిన బీజేపీ చేసిన పోరాటాలను వివరించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, కార్యకర్తలు లాఠీదెబ్బలు రక్తం చిందిస్తూ జైలుకు వెళ్లిన ఘటనలను గుర్తు చేస్తూ, భవిష్యత్తులోనూ టీచర్లకు, నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటాలు చేస్తామని ఇచ్చిన హామీలు పనిచేశాయని పార్టీ పెద్దలు అభిప్రాయ పడుతున్నారు. ఇవన్నీ టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య గెలుపునకు కీలకంగా నిలిచాయని, అదే విధంగా పట్టభద్రుల్లో అంజిరెడ్డికి భారీగా ఓట్లు పోలయ్యేలా చేసిందంటున్నారు. ఇదే ఊపుతో పట్టభద్రుల స్థానం కూడా కై వసం చేసుకుంటామని బీజేపీవర్గాలు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు.

మల్క కొమురయ్య విజయంలో సంజయ్‌ది కీలకపాత్ర

ఫలించిన పచ్చీస్‌ ప్రభారీ సమావేశాలు, ప్రచారం

ఎమ్మెల్సీగా కొమురయ్యది చారిత్రక విజయం

కరీంనగర్‌టౌన్‌: టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని, తమ అభ్యర్థి మల్కా కొమురయ్యది చారిత్రక విజయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీజేపీకి అండగా నిలిచిన ఉపాధ్యాయులకు, రేయింబవళ్లు కష్టపడిన కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కరీంనగర్‌ పార్లమెంట్‌ కార్యాలయం నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొమురయ్య విజయంలో తపస్‌ ప్రధాన భూమిక పోషించిందన్నారు. అభ్యర్థిని నిలబెట్టలేని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు బీజేపీని ఓడగొట్టడానికి అనేక కుట్రలు చేశాయని ఆరోపించారు. 317 జీవోకు వ్యతిరేకంగా ఆనాడు కరీంనగర్‌లో కొట్లాడిన బీజేపీ కార్యకర్తలను టీచర్లు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలని సూచించారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ ఇవ్వాల్సి ఉంటుందని భావించిన కేసీఆర్‌ ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే వీరికి పడుతుందని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా బీజేపీ అభ్యర్థే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కిషన్‌ రెడ్డి నాయకత్వంలో లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌లో బీజేపీ సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement