శిక్షణ.. ఉపాధి.. ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

శిక్షణ.. ఉపాధి.. ఉద్యోగం

Feb 19 2024 6:04 AM | Updated on Feb 19 2024 6:04 AM

ఐకేపీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, టాస్క్‌ సీఈవో(ఫైల్‌) - Sakshi

ఐకేపీ కార్యాలయాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, టాస్క్‌ సీఈవో(ఫైల్‌)

● ‘టాస్క్‌’ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు ● నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ● స్థల సేకరణలో అధికారులు నిమగ్నం

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రంలో టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందుకు అనుకూలమైన భవనాల అన్వేషణ ప్రక్రియ ఇప్పటికే పూర్తిచేసింది. ఈమేరకు టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌సిన్హాతో కలిసి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ ఇటీవల పలు ప్రాంతాల్లో అనువైన భవనాలు పరిశీలించారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐతో పాటు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని పలు భవనాల్లో సౌకర్యాలపై ఆరా తీశారు.

మెరుగైన శిక్షణ కోసం..

విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మెరుగైన శిక్షణ ఇప్పించి నైపుణ్యం పెంచేందుకు హైదరాబాద్‌, బెంగళూరు లాంటి నగరాల్లోని బహుళజాతి సంస్థలను కూడా ఇక్కడ భాగస్వాములను చేసేందుకు టాస్క్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టాస్క్‌కు ఎంపికైన నిరుద్యోగ యువత సామర్థ్యాన్ని బట్టి సాంకేతిక, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంచేలా శిక్షణ అందించనున్నారు.

శిక్షణ.. కొలువు..

జిల్లాలో ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులకు టాస్క్‌ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఆలోచనతో పెద్దపల్లిలో టాస్క్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. పీజీ, డిగ్రీ, ఇంటర్‌, డిప్లొమా తదితర కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులను పోటీ పరీక్షలకు ఈ సెంటర్‌ ద్వారా సన్నద్ధం చేయనున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు అవసరమైన నైపుణ్యం సాధించేందుకు శిక్షణ పొందే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఈమేరకు జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

విద్యార్థులను భాగస్వాములను చేస్తూ..

ఉన్నత విద్య అభ్యసించే కాలేజీ విద్యార్థులు ‘టాస్క్‌’లో భాగస్వాములయ్యేలా కసరత్తు చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పెంపుపై తర్ఫీదు ఇవ్వడమే కాదు.. వారిలో చైతన్యం వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్‌ భాషపై అవగాహన కల్పించి, వారు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేలా శిక్షణ ఇప్పించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం ఉన్నఒత్తిళ్లను తగ్గించి, మానసికోల్లాసం పెంపొందించడం లక్ష్యంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

‘విద్యావంతులైన యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టాస్క్‌(తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ) సెంటర్‌ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో అవకాశాలు దక్కేలా శిక్షణ అందించేందుకు ఐటీ నిపుణులను నియమిస్తాం’

– ఐటీ పరిశ్రమల శాఖ

మంత్రి శ్రీధర్‌ బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement