ఓదెల(పెద్దపల్లి): ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ఓదెల శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లోంచి నలుగురు అభ్యర్థులు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశారు. ఇందులో బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు, బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష, బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్‌కుమార్ శ్రీమల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాకే తమ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, పెద్దపల్లి అసెంబ్లీతోపాటు పార్లమెంట్ స్థానానికి పోటీచేసే వారంతా తొలుత ఓదెల మల్లన్న దర్శనం తర్వాతే నామినేషన్ వేయడం, ప్రచారం ప్రారంభించడం సెంటిమెంట్. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలతోపాటు చిన్నా, చితకా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి శ్రీమల్లికార్జున స్వామివారిని దర్శించుకుని, పూజలు చేసి తమ భవితవ్యాన్ని నిర్ణయించాలని దేవుకున్ని వేడుకున్నారు. ప్రధానంగా మూడు రోజులుగా మల్లికార్జునస్వామికి కోటి మొక్కులు చెల్లిస్తామని, తమను గెలిపించాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. మల్లికార్జునస్వామి ఎవరిని కరుణిస్తారో మరికొద్ది గంటల్లోనే తేలనుంది.