వెలుగుల వైపు.. కంటిపరీక్షలు | - | Sakshi
Sakshi News home page

వెలుగుల వైపు.. కంటిపరీక్షలు

Apr 1 2023 12:12 AM | Updated on Apr 1 2023 12:12 AM

సుల్తానాబాద్‌లో ‘కంటివెలుగు’ శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సంగీత 
 - Sakshi

సుల్తానాబాద్‌లో ‘కంటివెలుగు’ శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సంగీత

● జిల్లాలో పూర్తయిన కంటి పరీక్షలు 2,23,126 ● 32,824 మందికి రీడింగ్‌ అద్దాలు పంపిణీ ● ఆర్డర్‌ ఇచ్చినవి 36,393 ● దూరపు చూపు వారికి అందించినవి 10,073 ● దృష్టిలోపం ఉన్నవారికి అందించినవి 17,453 ● ఏర్పాటుచేసిన బృందాలు 34 ● పూర్తయిన శిబిరాలు 201 ● రిఫర్‌ చేసిన వారి సంఖ్య 33,402

సుల్తానాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జనవరి 18 నుంచి ‘కంటివెలుగు’ వైద్యశిబిరం రెండో దశ ప్రారంభమైంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ముమ్మరంగా నిర్వహించారు. 18 ఏళ్లకు పైబడిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటివెలుగు వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్రాల్లో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. జిల్లాలో మొత్తం 22, 6 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 16 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలుండగా వాటి పరిధిలో 34 బృందాలు నిత్యం గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 6,64,889 మంది 18 ఏళ్లు నిండిన వారు. 2,23,126 మందికి ఇప్పటి వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దగ్గరి చూపు 36,393 మందికి, దూరపు చూపు 17,453 మందికి కంటి అద్దాలు పంపిణీచేశారు.

ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు

జిల్లాలోని పలుప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు, మున్సిపల్‌ కార్మికులకు, జర్నలిస్టులకు, కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, న్యాయవాదులకు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేశారు. కంటి పరీక్షల కోసం వచ్చే బాధితులకు ప్రస్తుతం రీడింగ్‌ అద్దాలు మాత్రమే అందిస్తున్నారు. దగ్గర, దూరం చూపు లోపం ఉన్న బాధితులకు అద్దాలు ఆర్డర్‌ ఇవ్వడంతో వచ్చిన వారికి వెంటవెంటనే పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కంటివెలుగు శిబిరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. దూరపు చూపునకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాకు పలు దఫాలుగా 17453 అద్దాలు వచ్చాయి. వీటిని ఫోన్‌ ద్వారా సమాచారం అందించి శిబిరానికి పిలిపించి అందించారు. శిబిరానికి రాని వారికి ఆశా కార్యకర్తలతో ఇంటికి పంపిస్తున్నారు.

శస్త్రచికిత్సలకు సిపార్సులు

కంటి శస్త్రచికిత్సలు అవసరమైన బాధితులకు ఎప్పుడు చేస్తారో తెలపడం లేదు. సిఫార్సు మాత్రం చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదుచేస్తున్నారు. దీంతో వారు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని బాధితులు తెలుపుతున్నారు. శస్త్రచికిత్సలు అవసరమైన బాధితుల వివరాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించి శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు.

వార్డులు, గ్రామాల్లో పూర్తి..

జిల్లా మొత్తం 266 గ్రామాలు, 4 పట్టణాల్లో వందరోజులపాటు ‘కంటివెలుగు’ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. మార్చి 29 వరకు 201 పట్టణాలు వార్డుల్లో గ్రామాల్లో ఈ కార్యక్రమం పూర్తయింది. 4 పట్టణాలు, గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతోంది.

క్యాటరాక్ట్‌పై ప్రత్యేక దృష్టి

దగ్గరి చూపు సమస్యతో ఉన్నవారికి కంటిఅద్దాలు అందిస్తున్నాం. శుక్లాలు (క్యాటరాక్ట్‌)తోపాటు ఇతర సమస్యలున్న వారిని గుర్తించి జాబితా సిద్ధంచేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమం పూర్తి కాగానే ఆ అంశంపై దృష్టిసారిస్తాం.

– ప్రమోద్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి, పెద్దపల్లి

దూరపు చూపు అద్దాలు పంపిణీ

దూరపు చుప్పు అద్దాలు పరీక్షలు చేసిన తర్వాత ఆర్డర్‌ పెడుతున్నాం. ఇప్పటి వరకు 36,393 అవసరం కాగా 17,453 వచ్చాయి. గ్రామాలు, పట్టణాల్లో పంపిణీ చేశాం. కలెక్టర్‌, డీఈవోతో పాటు నిత్యం ఉన్నతాధికారులు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బాధితులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూస్తున్నాం.

– మహేందర్‌ వైద్యాధికారి, ‘కంటివెలుగు’ ప్రోగ్రాం నోడల్‌ ఆఫీసర్‌ పెద్దపల్లి.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement