
జిల్లాకు చేరిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు
● జిల్లాకు చేరిన 5వేల గిఫ్ట్ ప్యాకెట్లు ● మండలాల వారీగా పంపిణీకి కసరత్తు
పెద్దపల్లి రూరల్: రంజాన్ పండుగ సమీపిస్తోంది. జిల్లాలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం ఏటా అందిస్తున్నట్టే ఈ ఏడాది రంజాన్ పండుగ కానుకగా దుస్తుల (కుర్తా, పైజామ, సారీడ్రెస్ మెటీరియల్)తో కూడిన 5వేల కిట్‌లు బుధవారం జిల్లాకు చేరుకున్నాయి.
ఒక్కో కుటుంబంలో ముగ్గురికి..
ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందిస్తోంది. ప్రభుత్వం అందించే కిట్ లో ఒక్కో కుటుంబంలో ముగ్గురు సభ్యులకు సరిపడా దుస్తులు ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి. జిల్లాలోని మండలాల తహసీల్దార్లకు వాటిని అందించి లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ద్వారా అందించనున్నారు. జిల్లాలో పెద్దపల్లి, మంథని నియోజకవర్గాలకు 1500 కిట్లు చొప్పున, రామగుండం నియోజకవర్గానికి 2వేల కిట్లను పంపిణీ చేయనున్నారు. ముస్లిం మైనార్టీలకు రంజాన్‌తోఫా అందించడంతో పాటు ఇఫ్తార్ విందులను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
లబ్ధిదారులకు అందిస్తాం
జిల్లాలో నిరుపేద మైనార్టీలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందిస్తోంది. అందుకు అవసరమైన కిట్లను మండలాల వారీగా కేటాయించాం. తహసీల్దార్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూస్తాం. ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేస్తాం.
–మెహరాజ్ మహ్మద్,
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి