శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంత లోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వెళ్లి వస్తూ... అనంత లోకాలకు..

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

శుభ కార్యానికి వెళ్లిన వారు మృత్యుఒడికి చేరారు. బంధువుల శుభకార్యంలో సంతోషంగా గడిపి... తిరుగు ప్రయాణంలో వస్తున్న వారిని మృత్యువు దారి కాచి వెంటాడింది. నలుగురి ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అంతవరకు ఆటోలో సరదగా కబుర్లు చెబుతూ వస్తున్న వారు ఒక్కసారిగా హహకారాలు చేశారు. ఇంతలోనే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...

పాలకొండ/పాలకొండ రూరల్‌: పాలకొండ మండలం బడ్డుమహసింగి గ్రామానికి చెందిన గిరిజనులు సీతంపేట మండలం పుబ్బాడ గ్రామంలో గురువారం జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లేందుకు డోలమడ గ్రామానికి చెందిన ఆటోను కుదుర్చుకుని బయలుదేరారు. ఆటోలో 12 మంది వరకు వెళ్లారు. జంపరకోట మీదుగా సీతంపేట వెళ్లేందుకు ఉన్న ఘాట్‌ రోడ్డులో వెళ్లిన వీరు శుభకార్యంలో భోజనాలు చేసిన అనంతరం అదే రోడ్డులో ఆటోలో సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రహదారిలో మార్గమద్యంలోకి చేరుకునే సరికి సీతంపేట మండలం మీనకోట వద్ద ఆటో ఘాటీ డౌన్‌లో అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కొండగొర్రి శ్రావణి(30), ఆటో డ్రైవర్‌ అక్కుపల్లి రమణ(33), ఉర్లక శాంతి(35) సంఘటన స్థలంలోనే మరణించారు. ఆరిక లక్ష్మి(55) తీవ్రంగా గాయపడగా ఈమెను ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమద్యంలో మృతి చెందింది.

ఆస్పత్రుల్లో క్షతగాత్రులు..

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండగొర్రి మౌనిక, ఎనిమిదేళ్ల నిమ్మక చాందినిలను శ్రీకాకుళం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఆస్పత్రిలో కొండగొర్రి మౌనిక కుమారుడు రుషికుమార్‌, కొండగొర్రి హేమ, కొండగొర్రి మల్లమ్మ, కొండగొర్రి పద్మలత చికిత్స పొందుతున్నారు. ఎస్పీ మాధవరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ పవర్‌ స్వప్నిల్‌, డీఎస్పీ రాంబాబు ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉండగా రాత్రి సమయం వరకు మృతదేహాల ఆస్పత్రికి తరలించలేదు. ఘాటీ రోడ్డు కావడంతో మృతదేహాలను తీసుకురావడం కష్టంగా మారింది.

ఆనందం ఆవిరి

ఈ ఘటనలో మరణించిన ఆటో డ్రైవర్‌ అక్కుపల్లి రమణకు ఆటోనే జీవనం. అదే ఆటో ఆయనకు మృత్యుశకటంగా మారింది. రమణకు భార్య నాగమణితో పాటు వినీత, చందు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వినీత గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 563 మార్కులు సాధించింది. కుమార్తెను అభినందించి సాయంత్రం అన్నీ కొనిపెడతానని చెప్పి బయలుదేరిన తండ్రి ఇంతలోనే ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమార్తె విజయం ఆనందించేలోపే తండ్రి ఇలా దుర్మరణం చెందడంతో ఆయన కుటుంబంతో పాటు గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మిన్నంటిన రోదనలు

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒకే గ్రామస్తులు కావడంతో బడ్డుమహసింగిలో రోదనలు మిన్నంటాయి. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శుభకార్యంలో ఆనందంగా గడిపి ఇళ్లకు వస్తున్న వారిలో నలుగురు మృత్యువాత పడడం, మిగిలిన వారంతా క్షతగాత్రులుగా మారడంతో గ్రామంలో అంతులేని విషాదం అలుముకొంది.

మీనకోట వద్ద ఘాట్‌ రోడ్డులో ఆటో బోల్తా

తిరుగు ప్రయాణంలో నలుగురు దుర్మరణం

ఆరుగురికి తీవ్ర గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

ఆస్పత్రిని సందర్శించిన ఎస్పీ, సబ్‌ కలెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement