విలేకర్లపై దాడి చేసిన నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విలేకర్లపై దాడి చేసిన నిందితుల అరెస్టు

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

సాలూరు: పట్టణంలో సాక్షి ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్‌ నల్లి శ్రీనివాసరావు, సీవీఆర్‌ టి.వి రిపోర్టర్‌ చింతాడ సుబ్రహ్మణ్యంపై దాడి చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. పట్టణంలో పెద్దవీధికి చెందిన నిందితులైన కోనమజ్జి అజయ్‌, గండి అభి, సొండి శ్రీను బుధవారం మండల పరిషత్‌ కార్యాలయ సమీపంలో మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించారు. అనంతరం వారు ద్విచక్ర వాహనంపై బయలుదేరి అతి వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ శ్రీనివాసరావు, సుబ్రహ్మణం నడుపుతున్న దిచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా, నిందితులు అసభ్య పదజాలాలను ఉపయోగిస్తూ ఫిర్యాదుదారులను కొట్టి తీవ్రంగా గాయపరిచారు. నిందితులని అరెస్టు చేశామని, కోర్టులో హాజరపరచనున్నట్టు సీఐ తెలిపారు.

తొలగని అనుమానాలు?

సాక్షి విలేకరిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి స్థానికంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడని మరో ఫిర్యాదుదారుడైన సీవీఆర్‌ టీవీ రిపోర్టర్‌ సుబ్రహ్మణ్యం చెబుతుండగా ఆ నాలుగో వ్యక్తిని పట్టుకోకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. నిందితుల యొక్క ఫోన్‌ పేలు, కాల్‌ డేటాను పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ఆ నాలుగో వ్యక్తి ఎవరన్నది వెలుగులోకి వస్తుందని చర్చించుకుంటున్నారు. ఈ దాడి వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement