శాంతిభద్రతల పరిరక్షణలో.. ఏఆర్ విభాగం వెన్నెముక
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసుశాఖలో ఆర్మ్‌డ్ రిజర్వు (ఏఆర్) విభాగం అత్యంత కీలకమైనదని, శాంతిభద్రతల పరిరక్షణలో వెన్నెముక వంటిదని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత 15 రోజులుగా సాగిన ఏఆర్ బలగాల వార్షిక పునఃశ్చరణ (మొబిలైజేషన్) తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు వేడుకలకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన పోలీస్ కవాతు క్రమశిక్షణకు అద్దం పట్టింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు దోహదపడతాయని తెలిపారు. 15 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పోలీసులకు వివిధ రకాల ఆయుధాల వినియోగం, ఫైరింగ్, వీఐపీ సెక్యూరిటీ, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. క్షేత్రస్థాయిలో అంబుస్, కౌంటర్ అంబుస్ వంటి వ్యూహాలతో పాటు ఆపద సమయంలో ప్రాణాలు కాపాడే సీపీఆర్, ప్రథమ చికిత్స, అగ్నిమాపక చర్యలు, విపత్తు నిర్వహణపై వైద్యులు, ఫైర్ అధికారులతో అవగాహన కల్పించినట్లు వివరించారు. విధుల్లో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ఆర్థిక క్రమశిక్షణ, సర్వీసు నిబంధనలపై శిక్షణ ఇచ్చామని, వీటిని ఆచరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐ వెంకట్రావు, ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


