పర్యాటక గ్రామంగా నోండ్రుకోన | - | Sakshi
Sakshi News home page

పర్యాటక గ్రామంగా నోండ్రుకోన

Feb 13 2026 3:52 AM | Updated on Feb 13 2026 3:52 AM

పర్యాటక గ్రామంగా నోండ్రుకోన

పర్యాటక గ్రామంగా నోండ్రుకోన

పర్యాటక గ్రామంగా నోండ్రుకోన ● కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని నోండ్రుకోన గ్రామాన్ని ఒక పర్యాటక గ్రామంగా మార్చాలని తాను కోరుకుంటున్నట్లు కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకర్‌ రెడ్ది తెలిపారు. ఇందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను జిల్లాయంత్రాంగం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పర్యాటక ప్యాకేజీని అమలు చేయబోతున్నామని, తోటపల్లి దేవాలయంతో పాటు తాడికొండ, కుశ సమీప జలపాతాలకు వెళ్లే పర్యాటకులు ఈ గ్రామాన్ని కూడా సందర్శించేలా పర్యాటక ప్యాకేజీలో చేర్చుతామన్నారు. గ్రామస్తుల కష్టం వృథా కాకుండా తగిన సహాయ సహకారాలు అందించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌కు సూచించారు. నోండ్రుకోనలో గురువారం జరిగిన గ్రామ ముస్తాబు కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ శుభ్రంగా ముస్తాబు కావడమే కాకుండా ఒక పండుగలా గ్రామ ముస్తాబును మార్చడం అభినందనీయమన్నారు. గ్రామంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి గ్రామమంతా అందమైన పూలమొక్కలు, దేవతా విగ్రహాలు, కుండలు వంటివి ఏర్పాటుచేయడం గర్వకారణమ న్నారు. ప్రతి కుటుంబం, గ్రామం పరిశుభ్రంగా ఉండాలని, దేశ విదేశీ పర్యాటకులు సైతం వచ్చేలా చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించినట్లు గుర్తుచేశారు. ఈ గ్రామాన్ని త్వరలోనే పూర్తిస్థాయి పర్యాటక గ్రామంగా మారుస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రత్యేక అధికారి ఉషారాణి, మండల ప్రత్యేక అధికారి కనకదుర్గ వంటి మహిళా ఉద్యోగుల పట్టుదల గ్రామానికి కొత్త రూపాన్ని ఇచ్చాయని తెలి పారు. మహిళా ఉద్యోగులు ఒక అడుగు ముందుకేసి పనులను నడిపించడం గర్వకారణమన్నారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

మహిళల నృత్యాలు అద్భుతం

ఇక్కడి మహిళలు చేసిన నృత్యాలు చాలా బాగున్నాయని, కళాకారులు బృందంగా ఏర్పడి మరింత ఆకట్టుకునేలా చేయాలని గ్రామస్తులను కోరారు. కళాకారులను ప్రోత్సాహించేందుకు మన్యం కళా వేదిక ఉందని, మీ ప్రతిభతో రాష్ట్ర, దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని, ఆదాయం సంపాదించాలని సూచించారు. బాగా చేస్తే ఢిల్లీ వరకు పంపుతామని హామీ ఇచ్చారు. నృత్యం చూసేందుకే దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేలా కృషిచేయాలని కళాకారులకు పిలుపునిచ్చారు. కుశ వంటి గిరిజన గ్రామంలో రోడ్ల మీద పడుకునేంతగా పరిశుభ్రంగా ఉంచిన ఆదర్శ గ్రామం తీరును ప్రశంసించారు. జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ పీఓ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్ది మాట్లాడుతూ ఈ గ్రామాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఐసీడీఎస్‌ పీడీ డా.టి.కనకదుర్గ, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస్‌, గ్రామ ప్రత్యేక అధికారి ఉషారాణి, సర్పంచ్‌, ఇతర మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement