మహాశివరాత్రికి ముస్తాబు
నెల్లిమర్ల రూరల్: ఉత్తరాంధ్రలో అతి పెద్ద పుణ్యక్షేత్రం రామతీర్థం మహాశివరాత్రి జాతరకు ముస్తాభైంది. వైష్ణవ దేవాలయంగా ప్రసిద్ధికెక్కినా ప్రతి ఏటా జరుగుతున్న శివరాత్రి జాతరే రామక్షేత్ర ప్రత్యేకం.ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరుగుతున్నప్పటికీ హాజరవుతున్న భక్తుల సంఖ్య అంతంత మాత్రమే. కానీ శివరాత్రికి రెండు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాలకు మాత్రం విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా రామక్షేత్రానికి విచ్చేస్తారు. ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్య్యకార ప్రజలు అధిక సంఖ్యలో రామక్షేత్రానికి విచ్చేసి తొలిరోజు రాత్రంతా స్వామివారి క్షేత్రంలో కాగడాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో జాగరం ఉంటారు. మరుసటి రోజు ఉదయం రామకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా శ్రీరాముడిని అనంతరం క్షేత్ర పాలకుడైన ఉమాసదాశివ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
సర్వం సిద్ధం
ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. జాతరకు వచ్చే లక్షలాది మంది యాత్రికులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయశాఖతో పాటు ఇతర శాఖలు పకడ్బంధీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. తాగునీరు, విశ్రాంతి షెల్టర్లు, ప్రత్యేక క్యూలు, మరుగుదొడ్ల నిర్వహణ, రవాణా తదితర సదుపాయాలను కల్పిస్తున్నారు. అలాగే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. గత ఏడాదిలాగానే ఈ సారి కూడా సుమారు లక్షన్నరకు పైగా భక్తులు రావచ్చునని పోలీస్, దేవాదాయ, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
దేవదాయ శాఖ ఏర్పాట్లు
భక్తులకు రామతీర్థం ఆలయంలోనికి ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50, అలాగే ఉమాసదాశివ ఆలయం లోనికి ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం రూ.50గా కల్పిస్తున్నారు. భక్తుల కోసం 20వేల లడ్డూ ప్యాకెట్లు, పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేశారు. అలాగే ఎండతీవ్రతను దష్టిలో పెట్టుకుని చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. క్యూలలో తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే దేవస్థానానికి విద్యుత్ అలంకరణ పూర్తయింది. శివాలయం, ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గంలోనూ ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్‌వద్ద స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేశఖండన శాల వద్ద తోపులాట జరగకుండా బారికేడ్లు సిద్ధం చేశారు. ఆలయం చుట్టూ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రసాదాల పంపిణీ కౌంటర్‌ను సమీపంలోని కల్యాణ వేదిక ప్రాంగణంలోకి మార్చారు.
ప్రత్యేక ఆకర్షణగా శిఖరదీపం
శివరాత్రి పర్వదినాన తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలేశ్వరుని పర్వతంపై మూడు రోజుల పాటు ఏ విధంగా శిఖరజ్యోతిని వెలిగిస్తున్నారో..రామతీర్థంలో బోడికొండపై కూడా గడిచిన ఆరేళ్ల నుంచి శిఖర జ్యోతిని వెలిగిస్తున్నారు. దాతల సహకారంతో ప్రతి ఏటా నిర్వహిస్తున్న శిఖర జ్యోతి ప్రజ్వలన ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తొలుత మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఈ శిఖర జ్యోతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటికీ కూడా ఆ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో ప్రత్యేక పూజల నడుమ శిఖర జ్యోతిని వెలిగిస్తారు. ఈ మహా ఘట్టాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో బోడికొండపైకి వెళ్తుంటారు.
రామతీర్థం ఇలా చేరుకోవాలి
జిల్లా కేంద్రం విజయనగరానికి 13కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉండగా నెల్లిమర్లకు తూర్పుదిక్కున ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయనగరం–శ్రీకాకుళం వయా నెల్లిమర్ల రహదారిలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి విజయనగరంలో కోట నుంచి నేరుగా ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులు రణస్థలం మార్కెట్ వద్ద దిగి సతివాడ–నెల్లిమర్ల వాహనాలను ఆశ్రయించవచ్చు. రణస్థలం నుంచి 18కిలోమీటర్ల దూరం వస్తుంది.
రామతీర్థంలో ఈ నెల 15 నుంచి
రెండు రోజుల జాతర
సుమారు లక్షన్నరకు పైగా తరలిరానున్న భక్తులు
ఏర్పాట్లను పూర్తి చేసిన అధికార
యంత్రాంగం
ప్రత్యేక ఆకర్షణగా బోడికొండ
పర్వతంపై అఖండ శిఖరదీపం
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు
రామాలయంలో శివజాగారం
మహాశివరాత్రికి ముస్తాబు
మహాశివరాత్రికి ముస్తాబు


