శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
నెల్లిమర్ల రూరల్: రామతీర్థంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి అని ఎస్పీ ఏఆర్ దామోదర్ అధికారులకు సూచించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు సుమారు లక్ష మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సులను వేరే ప్రాంతంలో పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కోనేరు, బాత్ ఘాట్స్, కేశఖండన శాల, నీలాచలం పర్వతంపై బందోబస్తు నిర్వహించాలన్నారు. ఈవ్‌టీజింగ్, దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీతారామునిపేట, దన్నానపేట రహదారిలో వాహనాలు నిలుపుదల కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ గణేష్, ఈఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీ: ఇద్దరికి గాయాలు
వంగర: మండల పరిధి రుషింగి వద్ద రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గురువారం రుషింగి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మండలంలోని లక్ష్మీపేట గ్రామానికి చెందిన కలమట వెంకటేష్ కుడిచేయి విరిగింది. వీరఘట్టం మండలం చిట్టిపూడివలస గ్రామానికి చెందిన ఏడాకుల వంశీకి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ గణపతి తెలిపారు.
80 లీటర్ల సారా పట్టివేత
కొమరాడ: మండల కేంద్రం కొమరాడ గ్రామంలోని కొత్త కాలనీకి చెందిన గొర్లి సత్యనారాయణ 80 లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఎస్‌ఐ జగదీష్‌నాయుడు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా తో పాటు ఒక మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకుని సత్యనారాయణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
● ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి
తెర్లాం: మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లాకు రూ.కోటి 14లక్షలు మంజూరయ్యాయని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్, మండల ప్రత్యేకాధికారి టి.విమలారాణి చెప్పారు. ఈ మేరకు గురువారం తెర్లాం ఎంపీడీఓ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గల 410మంది అనాథ పిల్లలకు నెలకు రూ.4వేలు చొప్పున 7 నెలలకు మిషన్ వాత్సల్య పథకం కింద నిధులు మంజూరయ్యాయని, త్వరలో వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయని చెప్పారు. జిల్లాలో 2499 మెయిన్, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 22 కార్యకర్తల పోస్టులు, 277 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు టీహెచ్‌ఆర్, కిట్లు, బాలామృతం సరఫరా సక్రమంగానే జరుగుతోందని చెప్పారు. తెర్లాం మండలంలో సచివాలయ సిబ్బంది కొరత కారణంగా యుఎఫ్‌ఎస్ సర్వేలో వెనుకబాటు ఉందన్నారు. శతశాతం సర్వే నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న 130 ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిని గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఐసీడీఎస్ పీడీ తెలిపారు. ఆమెతో పాటు మండల ఇన్‌చార్జ్ ఎంపీడీఓ వెంకటరమణ, డిఫ్యూటీ ఎంపీడీఓ నీలిమ ఉన్నారు.
శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి
శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి
శివరాత్రి ఉత్సవాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తప్పనిసరి


