రీ సర్వేలో తప్పులకు తావులేకుండా చూడాలి
పార్వతీపురం: భూ రీ సర్వేలో తప్పులకు తావులేకుండా కచ్చితత్వం, పారదర్శకత ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి రీ సర్వే బృందాన్ని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఫేజ్–3, ఫేజ్–4 రీసర్వే బృందాలతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, పురోగతి, సాంకేతిక లోపాలను ఎప్పటికప్పుడు సరిచేయాలని సూచించారు. లాగిన్ సమస్యలు, డేటాలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలను తక్షణమే పరిష్కరించాలన్నారు. రీసర్వేలో ప్రతి భూమిని నిశితంగా పరిశీలించి, నిర్ధారించుకున్న తరువాతే రికార్డు చేయాలని చెప్పారు. నిర్దేశించిన గడువులోగా సర్వే ప్రక్రియను పూర్తిచేసి రైతులకు భూహక్కు పత్రాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, తహసీల్దార్‌లు, రీసర్వే డీటీలు, మండల సర్వేయర్లు, వీఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి


