శివరాత్రికి పక్కా ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాం సుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనులు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్‌లో సమీక్షించారు. రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం, సంగమేశ్వర స్వామి ఆలయం, పాల్తేరు, కోటిపల్లి తదితర శివాలయాలకు భారీసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తుల తాకిడి ముందే అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్యూలు ఏర్పాటుచేసి దర్శనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల గతం కంటే మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. తొక్కిసలాటలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్‌ఓ మురళి, డీపీవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
● ప్రతిరోజూ ప్రధాన జంక్షన్‌లలో
తనిఖీ చేయాలి
● డీపీఓలో నేర సమీక్ష సమావేశం
విజయనగరం క్రైమ్ : స్ఫూర్తిదాయకమైన పని తీరుతో ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ దామోదర్ సిబ్బందితో అన్నారు. ఈ మేరకు స్థానిక కంటోన్మెంట్‌లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నేరసమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ దామోదర్, ఏఎస్పీ సౌమ్యలతలు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖ వినియోగిస్తున్న టెక్నాలజీ పట్ల సిబ్బంది, అవగాహన పెంచుకోవాలని సూచించారు. నేరాలు జరగకుండా రాత్రి గస్తీని, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని చెప్పారు. నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతిరోజూ ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, ముఖ్యమైన జంక్షన్లు, లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. నాన్ బెయిలబుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని, కేసుల దర్యాప్తులోను నేరాలను కట్టడిచేసేందుకు సాంకేతికతను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ధారణ, డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి, కేసులు నమోదు చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఆర్.గోవిందరావు, జి.భవ్య రెడ్డి, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సీఐలు 34మంది ఎస్సైలు పాల్గొన్నారు.
వన్‌టౌన్ హెచ్‌సీకి సేవా పతకం
విజయనగరం క్రైమ్: విజయనగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెచ్‌సీగా విధులు నిర్వహిస్తున్న ఎం.అప్పలనాయుడికి విశిష్ట సేవా పతకం లభించింది. గతంలో ఏసీబీలో పని చేసినందుకు గాను ఆయన సేవలను గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేశారు. ఈ మేరకు విజయవాడ లో ఏసీబీ డీజీ అతుల్ సింగ్, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మిలు హెచ్‌సీ అప్పలనాయుడికి విశిష్ట సేవా పతకాన్ని బుధవారం బహూకరించారు. ఈ సందర్భంగా హెచ్‌సీ అప్పలనాయుడు మాట్లాడుతూ 2019 నుంచి 2025 వరకు తాను ఏసీబీలో పని చేశానని, ఆ సమయంలో సక్రమంగా విధులు నిర్వహించి శాఖకు, ప్రభుత్వ పరంగా చేసిన తన సేవలను గుర్తించారన్నారు.
శివరాత్రికి పక్కా ఏర్పాట్లు చేయాలి
శివరాత్రికి పక్కా ఏర్పాట్లు చేయాలి


