ఎవరు సైకోలో ప్రజలకు తెలుస్తోంది
● రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
బలిజిపేట: గత ఐదేళ్ల పరిపాలనలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యంకాని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సైకోనా... లేదంటే అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ప్రజలకు ఎటువంటి మేలు చేయని చంద్రబాబు, లోకేశ్‌లు సైకోలా అనేది ప్రజలకు తెలుస్తోందని రెవెన్యూశాఖ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని గలావిల్లిలో తూర్పుకాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్ ఇంటివద్ద బుధవారం గ్రామస్తులతో సమావేశమయ్యారు. సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి సంక్షేమం అందలేదని, పంటకు తగిన గిట్టుబాటు ధర లేదని, ఎరువులు అందడంలేదని, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఏరకంగా రైతుకు మేలు జరగలేదని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ధర్మాన స్పందిస్తూ గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పరిపాలనకు, చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనకు తేడాను మీరే గుర్తించాలన్నారు. వృద్ధులకు పింఛన్లు లేవని, మహిళలకు ఎటువంటి ఆర్థిక సాయం అందించలేదని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎదురవుతున్న సమస్యలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. విశాఖపట్నంలో రూ.కోట్ల విలువైన భూమిని చంద్రబాబు నాయుడు తన బంధువులకు దారాదత్తం చేశారని, ఇది అక్రమం, అవినీతి కాదా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారన్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతున్నారన్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకపాలన గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయలేదన్నారు. చంద్రబాబు పాలనపై గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇంటింటా తిరిగి అందరికీ తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త తలే రాజేష్, జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్, పార్టీ మండలాధ్యక్షుడు పి.మురళీకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు వి.సాయిరాం, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి టి.ప్రసాదరావు, జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు పీఎస్‌ఆర్ నాయుడు, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి కామేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


