ఎమ్మెల్యేకు బీజేపీ నేత సవాల్
● తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి..లేకుంటే పరువు నష్టం దావా వేస్తా
● బీజేపీ నాయకుడు ఉమామహేశ్వరరావు
పార్వతీపురం రూరల్: తనపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేసిన ఆరోపణలను దమ్ముంటే రుజువు చేయాలని బీజేపీ నేత సూరగల ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. ఇదే విషయమై ఆయన స్థానిక పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనపై 200 కేసులు ఉన్నాయని, తనను బహిష్కరించారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదన్నారు. తనపై ఏ పోలీస్ స్టేషన్‌లో ఎన్ని కేసులు ఉన్నాయో, రౌడీషీట్ ఎక్కడుందో ఆధారాలతో సహా బయటపెట్టాలన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచరిక పాలన కొనసాగిస్తున్నారని, అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. వెంకంపేట పంచాయతీ పరిధిలో చట్టబద్ధమైన తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, నిర్మాణ సామగ్రిని కాళ్లతో తన్ని దౌర్జన్యం చేయడం ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి చేపట్టిన రెండేళ్లలోనే పార్వతీపురంలో రూ.3 కోట్ల విలువైన ఆస్తులు ఎమ్మెల్యేకు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. అడిగిన 10 లక్షలు ఇవ్వలేదని కక్షగట్టి తన నిర్మాణాలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి ఎమ్మెల్యే, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, తనకు ఏ చిన్న ప్రమాదం జరిగినా దానికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదేనన్నారు. ఇప్పటికే ఈ విషయమై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. తన జోలికి వస్తే న్యాయస్థానాల ద్వారా తేల్చుకుంటానన్నారు.


