రెవెన్యూ ‘లీలల’పై దర్యాప్తు
● నేడు ఆర్‌డీఓ కార్యాలయంలో విచారణ
చీపురుపల్లి: మండలంలోని కర్లాం గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న రైతులకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు ప్రారంభమైంది. కర్లాం గ్రామంలో రైతుల భూములు వేరొకరి పేరుపై వన్‌బీలు చేసి చేతివాటం చూపిన రెవెన్యూ యంత్రాంగం వ్యవహారంపై ఈ నెల 8న సాక్షి పత్రికలో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి దర్యాప్తుకు ఆదేశించారు. తొలుత నివేదిక ఇవ్వాలంటూ తహసీల్దార్ ధర్మరాజును ఆదేశించినప్పటికీ ఈ నెల 9న దర్యాప్తుకు ఆర్‌డీఓను నియమించినట్లు తెలిసింది. దీంతో చీపురుపల్లి ఆర్‌డీఓ సమక్షంలో విచారణ జరగనుంది. అందులో భాగంగానే కర్లాం గ్రామానికి చెందిన రైతులతో బాటు ఆ భూములను వన్‌బీ చేయించుకున్న వారిని కూడా తమ దగ్గర ఉన్న ధ్రువీకరణ పత్రాలతో సహా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్‌డీఓ కార్యాలయంలో హాజరవ్వాలని నోటీసులు అందజేశారు.
పీఏసీఎస్‌పై విచారణకు ఆదేశం
ఇదిలా ఉండగా కర్లాంలో జరిగిన భూమి రికార్డుల తారుమారు వ్యవహారంలో అవే భూములపై కర్లాం పీఏసీఎస్ నుంచి రూ.15 లక్షలు రుణం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై మంగళవారం సాక్షి పత్రికలో ‘సాగు ఒకరిది రుణం మరొకరిది’ అనే శీర్షికన కథనం వెలువడిన విషయం విదితమే. దీనిపై స్పందించిన జిల్లా కేంద్రసహకార బ్యాంక్ చైర్మన్ కిమిడి నాగార్జున ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీసీసీబీ సీఈఓను ఆదేశించినట్లు తెలిసింది.


